నగరంలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని అరికట్టేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా విశాఖపట్నం మేజిస్ట్రేట్ 59 మంది నేరస్తులను రెండు వారాలు జైలుకు పంపారు. జైలు శిక్ష సమయంలో భీమిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రోజూ ఒక గంట పాటు సమాజ సేవ చేయాలని ఆదేశించారు.
గురువారం మద్యం తాగి వాహనాలు నడిపిన 114 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఆనందపురం, భీమిలి, వన్ టౌన్, న్యూపోర్టు, గాజువాక సహా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో నేరస్తులను పట్టుకున్నారు. ఒక్కొక్కరికి 1000 నుండి 13,000 వరకు జరిమానాలు విధించారు.
నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వాహనాలు నడుపుతున్న వారి ప్రాణాలకు హాని కలగడమే కాకుండా రోడ్డుపై ప్రయాణించే అమాయకుల భద్రత కూడా ప్రమాదంలో పడుతుందన్నారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం మానుకోవాలని గట్టిగా సూచించారు.