విషాదం అన్న‌ప‌దం చాల‌దు…ఇది న‌ర‌మేథం

60-children-die-in-48-hours-as-oxygen-supply-at-uttar-pradesh-government-sector

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని గోర‌ఖ్ పూర్ లో మృత్యువు అభం శుభం తెలియ‌ని చిన్నారుల‌ను క‌బ‌ళించివేస్తోంది. ఇప్ప‌టిదాకా 60 మందికి పైగా చిన్నారులు మృత్యువాత ప‌డ్డారు. ఈ దారుణ విషాదానికి ప్ర‌మాద‌మో, అనుకోని విప‌త్తో కార‌ణం కాదు…బాధ్య‌త‌లు స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించ‌లేని ప్ర‌భుత్వం, వ్యాపార కాంక్ష త‌ప్ప క‌నీస మాన‌వ‌త్వం లేని ఓ ప్ర‌యివేట్ సంస్థ కార‌ణం. ఆక్సిజ‌న్ అంద‌క ఈ ఆస్ప‌త్రిలో చిన్నారులు ఒక్కొక్క‌రుగా మృత్యువాత ప‌డుతున్నారు.

గోరఖ్ పూర్‌లోని బీఆర్ డీ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి స్థానికంగా మంచి పేరుంది. చుట్టుప‌క్క‌ల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున్న చిన్నారుల‌ను వైద్యం కోసం త‌ల్లిదండ్రులు ఇక్క‌డ‌కు తీసుకువ‌స్తుంటారు. అయితే ఈ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా అందించేందుకు ఓ ప్రైవేట్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే కొద్దినెల‌లుగా చెల్లింపులు లేక‌పోవ‌టంతో ఆ సంస్థ‌కు రూ. 70ల‌క్షల బ‌కాయిలు ప‌డ్డాయి. దీనిపై ప‌లుమార్లు ఫిర్యాదులు చేసినా ప్ర‌భుత్వ అధికారులు స్పందించ‌క‌పోవ‌టంతో ఆ సంస్థ ఈ నెల 9 నుంచి ఆస్ప‌త్రికి ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా నిలిపివేసింది.

ఇది చిన్నారుల పాలిట శాప‌మ‌యింది. మెద‌డు వ్యాపు వ్యాధికి చికిత్స అందిస్తున్న వార్డుల్లోనే చిన్నారుల మ‌ర‌ణాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ఆస్ప‌త్రి వ‌ర్గాలు చెప్పాయి. ప్ర‌భుత్వం బ‌కాయిలు చెల్లించ‌టంలో క‌న‌బ‌ర్చిన నిర్ల‌క్ష్యం వ‌ల్లే చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు మండిప‌డుతున్నాయి. దీనికి బాద్య‌త‌గా సీఎం రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ విషాదం త‌రువాత ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మేలుకొంది.

త‌క్ష‌ణ‌మే ప‌రిస్థితిని స‌మీక్షించిన సీఎం యోగీ ఆదిత్య‌నాథ్ …హుటాహుటిన ఆక్సిజ‌న్ అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. అటు ఈ ఘ‌ట‌న‌తో దేశం యావ‌త్తూ నివ్వెర‌పోయింది. ఇది విషాదం కాద‌ని,న‌ర‌మేధ‌మని నోబెల్ బ‌హుమ‌తి గ్ర‌హీత‌, బాల‌ల హ‌క్కుల ఉద్య‌మ కారుడు కైలాశ్ స‌త్యార్థి ట్విట్ట‌ర్ వేదిక‌గా మండిప‌డ్డారు. 70 ఏళ్ల స్వ‌తంత్ర భార‌తం చిన్నారుల‌కు చెప్పే అర్ధం ఇదేనా…అని ఆయ‌న ప్ర‌శ్నించారు. దీనికి బాధ్యుల‌పై సీఎం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. సీఎం తీసుకునే నిర్ణ‌యం ద‌శాబ్దాలుగా అవినీతిలో కూరుకుపోయిన వైద్య‌వ్య‌వ‌స్థ‌ను స‌రిచేయాల‌ని, అప్పుడే ఇలాంటి న‌ర‌మేధాలు జ‌ర‌గ‌కుండా ఉంటాయ‌ని ట్వీట్ చేశారు.

మరిన్ని వార్తలు:

ఆప‌రేష‌న్ గుజ‌రాత్ ప్రారంభించిన హ‌స్తం