వ్య‌తిరేకుల‌ను స‌హించ‌బోను

Nitish Kuma attacks Sharad Yadav says 'JD-U is my party too'

Posted August 12, 2017 at 18:50 

ఎన్డీఏతో నితీశ్ చెలిమిపై గుర్రుగా ఉన్న జేడీయూ సీనియ‌ర్ నేత శ‌ర‌ద్‌యాద‌వ్ కు చెక్ పెట్టేందుకు బీహార్ ముఖ్య‌మంత్రి సిద్ద‌మ‌య్యారు. నితీశ్ కు వ్య‌తిరేకంగా శ‌ర‌ద్ యాద‌వ్ జేడీయూనే చీల్చే ఆలోచ‌న‌లో ఉన్నార‌న్న వార్త‌ల నేప‌థ్యంలో నితీశ్ కుమార్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రాజ్య‌స‌భ‌లో జేడీయూ ప‌క్ష నేత‌గా ఉన్న శ‌ర‌ద్ యాద‌వ్ ను ఆ ప‌ద‌వి నుంచి తొల‌గించారు. ఈ మేర‌కు జేడీయూ రాజ్య‌స‌భ స‌భ్యులు నిన్న‌నే ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన వెంక‌య్య నాయుణ్ణి క‌లిసి త‌మ పార్టీ అద్య‌క్షుడి నిర్ణ‌యాన్ని వివ‌రించారు. శ‌ర‌ద్ యాద‌వ్ స్థానంలో త‌మ పార్టీ కి చెందిన సీనియ‌ర్ ఎంపీ ఆర్సీపీ సింగ్ ను జేడీయూ ప‌క్ష నేత నియ‌మించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. జేడీయూకు రాజ్య‌స‌భ‌లో ప‌దిమంది ఎంపీలున్నారు.

వారిలో శ‌ర‌ద్ యాద‌వ్ మిన‌హా తొమ్మిది మంది ఎంపీలు వెంక‌య్య నాయుణ్ని క‌లిశారు. దీంతో నితీశ్ నిర్ణ‌య‌నికి వెంక‌య్య ఆమోద‌ముద్ర వేశారు. ఎన్డీఏ కూట‌మితో నితీశ్ ప్ర‌యాణాన్ని వ్య‌తిరేకిస్తున్నందుకే శ‌ర‌ద్ యాద‌వ్ పై వేటు ప‌డిందని, ఈ నిర్ణ‌యం ద్వారా నితీశ్ త‌న‌కు వ్య‌తిరేకంగా గ‌ళ‌మెత్తే నేత‌ల‌ను స‌హించ‌బోన‌ని స్ప‌ష్టంచేశార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. అటు త‌మ కొత్త చెలికాడుకి మోడీ, అమిత్ షాలు బంప‌ర్ ఆఫ‌ర్ ఇవ్వాల‌ని భావిస్తున్నారు.

ఎన్డీఏ కో క‌న్వీన‌ర్ బాధ్య‌త‌ల‌ను నితీశ్ కు అప్ప‌గించాల‌ని వారు భావిస్తున్నారు. మోడీ, షా ఆఫ‌ర్ ను నితీశ్ అంగీక‌రించిన‌ట్టు స‌మాచారం. బీహార్ తో పాటు జాతీయ స్థాయిలో మిస్ట‌ర్ క్లీన్ ఇమేజీ ఉన్న నితీశ్ ఎన్డీఏ కో క‌న్వీన‌ర్ గా ఉంటే కూట‌మికి లాభిస్తుంద‌ని మోడీ, షా భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ ప‌ద‌వి ద్వారా ఇక నితీశ్ మ‌ళ్లీ యూపీఏ వైపు వెళ్లే అవ‌కాశం కూడా ఉండ‌ద‌ని వారి ఆలోచ‌న‌. అటు జేడీయూ కేంద్ర‌ప్ర‌భుత్వంలో చేరే అవ‌కాశం కూడా క‌నిపిస్తోంది. దీనిపై నితీశ్ మోడీ, షాల‌తో చ‌ర్చించార‌ని, త్వ‌ర‌లోనే ఈ చేరిక ఉంటుంద‌ని వార్త‌లొస్తున్నాయి. దీంతో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో జేడీయూ ఎంపీలు కీల‌క మంత్రి ప‌ద‌వులు ద‌క్కించుకోనున్నారు.

మరిన్ని వార్తలు:

నాయ‌కుడు కావ‌లెను

ఆప‌రేష‌న్ గుజ‌రాత్ ప్రారంభించిన హ‌స్తం

స‌రిహ‌ద్దుల‌కు భారీగా సైన్యం త‌ర‌లింపు

SHARE