సామాన్యులకు మరో షాక్

సామాన్యులకు మరో షాక్

సామాన్యులకు మరో షాక్ తగలనుందా? వచ్చే నెల నుంచి మళ్లీ ధరలు పెరగబోతున్నాయా? వెలువడుతున్న నివేదికలను గమనిస్తే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. వచ్చే నెల నుంచి అంటే అక్టోబర్ నెలలో గ్యాస్ ధరలు మరోసారి పెరిగే అవకాశముంది.

నివేదికల ప్రకారం.. వచ్చే నెల నుంచి గ్యాస్ ధరలు ఏకంగా 57 – 70 శాతం వరకు పెరిగే ఛాన్స్ ఉంది. కుకింగ్, డ్రైవింగ్ మరింత భారం కానుంది. అక్టోబర్ 1న కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను నిర్ణయించనుంది. దీని వల్ల ఆటో ఫ్యూయెల్, పైప్డ్ నేచురల్ గ్యాస్ ధరలు పెరగనున్నాయి.

కొత్త డొమెస్టిక్ గ్యాస్ పాలసీ 2014లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నేచురల్ గ్యాస్ ధరలను ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమీక్షిస్తూ వస్తుంది. విదేశీ మార్కెట్‌లోని ధరల ప్రాతిపదికన మన దేశంలో ధరలు నిర్ణయమౌతాయి. దీంతో అక్టోబర్ 1న ధరలు భారీగా పెరగొచ్చనే అంచనాలున్నాయి.

ప్రస్తుతం ఏపీఎం గ్యాస్ ధర ఎంఎంబీటీయూ‌కు 1.79 డాలర్‌గా ఉంది. ఇది 3 డాలర్ల పైకి చేరొచ్చనే అంచనాలున్నాయి. ఎంఎంబీటీయూకు 1 డాలర్ పెరిగినా కూడా కంపెనీలకు 25 నుంచి 30 శాతం ప్రాఫిట్ పెరుగుతుంది. అయితే సామాన్యులపై ప్రభావం పడుతుంది. ఇకపోతే విదేశీ మార్కెట్‌లో నేచురల్ గ్యాస్ ధర బుధవారం ఒక్క రోజే 8 శాతం మేర పెరిగింది.