డాక్టర్‌నని చెప్పుకుంటూ యువతులను మోసం చేస్తున్న ఓ వ్యక్తి

డాక్టర్‌నని చెప్పుకుంటూ యువతులను మోసం చేస్తున్న ఓ వ్యక్తి

బాలీవుడ్‌ సినిమా కబీర్‌ సింగ్ ,అర్జున్‌ రెడ్డి రీమేక్‌ చూసి స్ఫూర్తి పొంది, తానో డాక్టర్‌నని చెప్పుకుంటూ ఓ వ్యక్తి అమాయక యువతులను మోసం చేశాడు. అతడి చేతిలో మోసపోయిన ఓ డాక్టర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో గుట్టురట్టై జైలు పాలయ్యాడు. ఈ సంఘటన న్యూఢిల్లీలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీకి చెందిన ఆనంద్‌ కుమార్‌ అనే వ్యక్తి కబీర్‌ సింగ్‌ సినిమాలోని ఆర్థోపెడిక్‌ సర్జన్‌‌ షాహిద్‌ కపూర్‌‌ పాత్రతో స్ఫూర్తి పొందాడు. తానో ఆర్థోపెడిక్‌ సర్జన్‌నని చెప్పుకుంటూ.. డా. రోహిత్‌ గుజరాల్‌ అనే మారుపేరుతో టిండర్‌ డేటింగ్‌ యాప్‌ ద్వారా అమాయక యువతులకు ఎర వేయసాగాడు. ఈ నేపథ్యంలో ఓ డాక్టర్‌ అతడి వలలో చిక్కింది.

ఇద్దరి మధ్యా చాటింగ్‌ మొదలైంది. కుమార్‌ ఆమెను పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశాడు. అతడ్ని పూర్తిగా నమ్మిన సదరు యువతి దాదాపు 30వేల రూపాయలు అతడి అకౌంట్‌కు బదిలీ చేసింది. కొద్దిరోజుల తర్వాత ఆ యువతి ఆనంద్‌పై అనుమానం వ్యక్తం చేయగా.. ఆమెకు చెందిన ప్రైవేట్‌ చిత్రాలు, వీడియోలు బయటపెడతానంటూ బ్లాక్‌ మెయిల్‌ చేయసాగాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి, అతడిపై పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆనంద్‌తో పాటు అతడికి సహకరిస్తున్న మరో యువకుడ్ని అరెస్ట్‌ చేశారు.