వయోవృద్ధుడిని కొట్టి చంపిన కొందరు వ్యక్తులు

వయోవృద్ధుడిని కొట్టి చంపిన కొందరు వ్యక్తులు

తాజాగా 70 సంవత్సరాల వృద్ధుడి కరెంటు స్తంభానికి కట్టేసి మరీ చొతగ్గొట్టారు. ఫలితంగా- ఆ వృద్ధుడు సంఘటనాస్థలంలోనే మరణించాడు. జార్ఖండ్ లోని సాహిబ్ గంజ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని బెల్బాడ్ తాలూకాలో కొండప్రాంతమైన కుచి పహారీ గ్రామంలో చోటు చేసుకుంది. వన మూలికలను ఏరుకోవడానికి వెళ్లిన వృద్ధుడు సాయంత్రం తిరిగి వస్తుండగా..పిల్లలను ఎత్తుకెళ్లే వాడిగా అనుమానించి కుచి పహారీ గ్రామస్తులు అతణ్ని అడ్డగించారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలను ఇవ్వలేకపోయాడా వృద్ధుడు. దీనితో అనుమానం మరింత రెట్టింపు కావడంతో అతణ్ని కరెంటు స్తంభానికి కట్టేసి చితకబాదారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే మీర్జాచౌకీ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు.

అప్పటికే ప్రాణాపాయ స్థితికి చేరుకున్న అతణ్ని ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే మరణించాడు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్నట్లుగా భావిస్తున్న కొందరు గ్రామస్తులపై కేసు నమోదు చేసినట్లు సాహిబ్ గంజ్ సబ్ డివిజినల్ పోలీస్ అధికారి నావల్ శర్మ తెలిపారు. నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. వారిపై మీర్జాచౌకి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు.