తల్లికి వరుడు కావాలి అంటూ ట్వీట్ చేసిన కూతురు

తల్లికి వరుడు కావాలి అంటూ ట్వీట్ చేసిన కూతురు
హైదరాబాద్‌లో కీర్తి ప్రియుడి మత్తులో కన్నతల్లిని కిరాతకంగా చంపేసి క్రూరంగా ప్రవర్తించింది. కీర్తిలాంటి క్రూరత్వం ఉన్న కూతుళ్లే కాదు అమ్మను ప్రాణానికి ప్రాణంగా చూసుకునే బిడ్డలు మన చుట్టూ చాలామంది ఉన్నారు. అమ్మ మీద ప్రేమతో ఆమెకు రెండో పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యిందో కూతురు. తన తల్లికి వరుడు కావాలంటూ సోషల్ మీడియాలో ప్రకటన ఇచ్చింది. తల్లుల్ని కిరాతకంగా చంపే ఎంతోమంది కూతుళ్లకు తాను పూర్తి వ్యతిరేకమని నిరూపించింది.
ముంబైకి చెందిన లా విద్యార్థి ఆస్తా వర్మ తన తల్లికి వరుడు కావాలి అంటూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. అమ్మతో కలిసి దిగిన ఫోటోను ట్వీట్ చేసి  వరుడ్ని వెతికే పనిలో ఉంది. ఆస్తా శర్మ అక్కడితో ఆగలేదు. ఎలాంటి లక్షణాలు ఉన్న వరుడు కావాలో కూడా కండిషన్స్ చెప్పింది. వరుడు శాకాహారి గా ఉండాలని,మద్యం సేవించరాదని, బాగా సెటిల్ అయిన వ్యక్తి అయ్యి, మంచివాడై ఉండాలంటోంది. ఒక్క మాటలో చెప్పాలంటే మంచి లక్షణాలుండి తన తల్లిని బాగా చూసుకొనే వ్యక్తి కావాలంటోంది.
మహిళలకు, మగవాళ్లకు ఉత్తమ భాగస్వాములు, మంచి స్నేహితులు సోషల్ మీడియాలో దొరుకుతారని తాను విన్నానని అందుకే ఈ ట్వీట్ చేస్తున్నాని ఆస్తా వర్మ చెబుతోంది. తన తల్లికి 50ఏళ్ల వయసున్న అందమైన వరుడు కావాలంటోంది. ఆస్తా శర్మ ట్వీట్‌తో నెటిజన్లు సైతం ఫిదా అయ్యారు. ఈ ట్వీట్‌ను రీ ట్వీట్‌తో మోత మోగిస్తున్నారు.