ఓ నిరుపేద కార్మికుడిని అదృష్టం వరించింది. రెక్కలు ముక్కులు చేసుకుంటూ వజ్రాల గనుల్లో శ్రమించే అతడికి ఓ వజ్రం దొరికింది. మధ్యప్రదేశ్‌లోని పన్నా వజ్రాల గనుల్లో పనిచేసే బల్బీర్‌సింగ్ యాదవ్‌కు గురువారం ఏకంగా 7.2 క్యారెట్ల వజ్రం లభించింది. ఆ వజ్రాన్ని చూడగానే సంతోషంగా ఎగిరి గంతేశాడు. అనంతరం అధికారుల వద్దకు వెళ్లి విషయాన్ని తెలియజేశాడు. బుందేల్‌ఖండ్‌లో వెనుకబడ్డ ప్రాంతమైన పన్నా వజ్రాల గనులకు ప్రసిద్ధి. పతి బజారియా ప్రాంతంలోని కృష్ణ కల్యాణ్‌పూర్ గనుల్లో ఈ వజ్రం లభించినట్టు డైమండ్ ఇన్స్పెక్టర్ అనుపమ్‌సింగ్ తెలిపారు.
వజ్రం వాస్తవ విలువ ఎంతనేది ఉన్నతాధికారులు వెల్లడిస్తారని ఆయన చెప్పారు. ఇక, బల్బీర్‌సింగ్, అతని భార్య లాడ్‌వతి సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ వజ్రం విలువ రూ.35-40 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఈ వజ్రాన్ని వేలం వేసి, 12.5 శాతం రాయితీ మినహాయించి మిగతాది బల్బీర్‌సింగ్ దంపతులకు అందజేస్తామని అధికారులు పేర్కొన్నారు.
పన్నా జిల్లాలోనే ఇటీవల ఓ కూలీకి రూ.50లక్షల విలువైన వజ్రం లభించిన విషయం తెలిసిందే. రాణిపురా గనిలో వజ్రాల కోసం తవ్విన ఆనందిలాల్ కుష్వాహకు 10.69 కేరట్ల వజ్రం లభించింది. రాణిపూర్ ప్రాంతంలోని భూమికి అనందిలాల్ కుష్వాహకు పట్టా ఇచ్చారు. అంతకు ముందు కుష్వాహకు ఒక వజ్రం లభించింది. లాక్ డౌన్ సమయంలో రెండు వజ్రాలు దొరికాయని అధికారులు చెప్పారు. తనకు రెండు వజ్రాలు లభించడంతో సంతోషంగా ఉందని, కుష్వాహ పేర్కొన్నారు.