Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2012 డిసెంబరు 16న ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనను ఎవ్వరూ మరిచిపోలేరు. కదులుతున్న బస్సులో 23 ఏళ్ల నిర్బయపై దుండగులు జరిపిన సామూహిక అత్యాచారం దేశప్రజల్నే కాదు ప్రపంచాన్నే నివ్వెరపరిచింది. నిర్భయకు మద్దతుగా, ఆమెకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ యువత స్వచ్చందంగా రోడ్ల మీదకు తరలివచ్చి ఆందోళనలు నిర్వహించింది. అయితే అత్యుత్తమ చికిత్స అందించినప్పటికీ నిర్భయ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తరువాత నిర్భయ పేరుతో చట్టం కూడా రూపొందించారు. నిర్భయ దారుణం తర్వాత దేశంలో ముఖ్యంగా ఢిల్లీ నగరంలో అత్యాచార ఘటనలు తగ్గిపోతాయని అంతా భావించారు. కానీ అలాంటి పరిస్థితి ఏ మాత్రం కనిపించడం లేదు… పైగా ప్రపంచంలో అత్యాచారాలు ఎక్కువగా జరిగే నగరాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచంలోని 19 నగరాలపై థామ్ సన్ రాయటర్స్ ఫౌండేషన్ సర్వే నిర్వహించింది. మహిళలపై జరిగే లైంగిక వేధింపుల్లో ఢిల్లీ, బ్రెజిల్ లోని సావోపౌ నగరాలు అగ్రస్థానంలో ఉన్నట్టు ఈ సర్వేలో వెల్లడయింది. సావోపౌ నగరంలో మహిళల వేధింపులు ఇటీవల కాలంలో రెట్టింపయ్యాయి. 29 మిలియిన్ల జనాభా ఉన్న ఢిల్లీ మహిళలకు రక్షణ కల్పించడంలో మాత్రం ఘోరంగా విఫలమవుతోంది. అయితే ఈ రెండు నగరాల్లోనే అత్యాచారాలు ఎక్కువగా ఉన్నాయనడానికి కచ్చితమైన ఆధారాలు లేవని భారత్ లో ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం హెడ్ రెబెక్కా రిచ్ మన్ తెలిపారు. అటు మహిళలకు రక్షణ లేని నగరాల జాబితాలో ఢిల్లీ, సావోపౌ తర్వాత ఈజిప్ట్ రాజధాని కైరో నిలిచింది. తర్వాత స్థానాల్లో మెక్సికో రాజధాని మెక్సికో సిటీ, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరాలు ఉన్నాయి. మహిళల భద్రత బాగా ఉన్న నగరాల్లో జపాన్ రాజధాని టోక్యో తొలిస్థానంలో నిలిచింది.