ఆధార్ ను అన్నింట్లో తప్పనిసరి చేస్తూ కేంద్రం ఓ పక్క నిర్ణయం తీసుకుంటోంటే..మరో పక్క ఆధార్ సమాచార భద్రతపై సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ తరుణంలో ద ట్రిబ్యూన్ పత్రిక నిర్వహించిన ఓ స్ట్రింగ్ ఆపరేషన్ లో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగుచూశాయి. ప్రభుత్వం చాలా భద్రంగా ఉందంటున్న ఆధార్ సమాచారం కేవలం రూ. 500లకు వాట్సప్ గ్రూప్ ద్వారా ఎవరైనా తెలుసుకోవచ్చన్న నిజం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ద ట్రిబ్యూన్ ప్రచురించిన కథనం ప్రకారం కొన్ని వాట్సప్ గ్రూపులతో ఈ రాకెట్ ఆరు నెలల క్రితమే మొదలయింది. ద ట్రిబ్యూన్ రిపోర్టర్లకు స్వయంగా ఈ అనుభవంఎదురయింది. రూ. 500 చెల్లించి పది నిమిషాల్లోనే ఎవరి వ్యక్తిగత వివరాలైనా పొందేందుకు వీలుగా ఏజెంట్ వారికి ఓ పోర్టల్ కు సంబంధించి లాగిన్, పాస్ వర్డ్ వివరాలు ఇచ్చాడు. మరో రూ. 300 ఇవ్వగా ఆధార్ కార్డులను ప్రింట్ చేసేందుకు ఉద్దేశించిన సాఫ్ట్ వేర్ కూడా పంపించాడు.
ఈ విషయాన్ని రిపోర్టర్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యూఐడీఏఐ చంఢీగఢ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా..ఇది జాతీయ భద్రతా ఉల్లంఘనగా పేర్కొన్నారు. యూఐడీఐఏ డైరెక్టర్ జనరల్, తనకు తప్ప పంజాబ్ లో మూడో వ్యక్తికి లాగిన్ అయ్యే అవకాశం లేదని చంఢీగఢ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ సంజయ్ జిందాల్ చెప్పారు. దీనిపై యూఐడీఏఐ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆధార్ సమాచారమంతా భద్రంగా ఉందని, రూ. 500 చెల్లించి వాట్సప్ ద్వారా ఎవరి ఆధార్ వివరాలైనా తేలిగ్గా పొందవచ్చన్న ప్రచారం వట్టి పుకారేనని స్పష్టంచేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటివి సృష్టిస్తున్నారని, వాటిని నమ్మొద్దని, ఆధార్ కు సంబంధించి ఎలాంటి వివరాలూ బయటకు వెళ్లవని హామీ ఇస్తున్నామని తెలిపింది.