పోస్టాఫీసుల్లో ఆధార్

aadhar in post offices

ఒకప్పుడు సేవింగ్ ఖాతాలకే పరిమితమైన పోస్టాఫీసుల సేవలు విస్తృతమవుతున్నాయి. ప్రస్తుతం ఆధార్ సేవలూ అందుతున్నాయి. ఆధార్ నమోదును నేడు అన్ని పోస్టాఫీసుల్లో చేపడుతున్నారు. ఆధార్ నమోదుతో పాటు తప్పొప్పుల సవరణలనూ స్థానిక పోస్టాఫీసుల్లో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆధార్ సేవలను విస్తృతం చేయడంలో భాగంగా ఇటీవల అన్ని పోస్టాఫీసుల్లో ఆధార్ నమోదును ప్రవేశపెట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆధార్ నమోదుకు డిమాండ్ పెరగడంతో పాటు తొలినాళ్లలో చేపట్టిన నమోదులో తప్పొప్పుల సవరణలు ఎక్కువగా ఉంటున్నాయి. అంతేకాక చిరునామాల మార్పుల వంటి సవరణలు ప్రతినిత్యం పెరుగుతూ ఎక్కువ సంఖ్యలో ఉంటున్నాయి. దీంతో అక్కడక్కడా అరుదుగా ఉండే ఆధార్ కేంద్రాలు నిత్యం కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇటీవల ఆధార్ నమోదు ప్రవేశపెట్టిన అధికారులు తాజాగా పోస్టాఫీసుల్లోనూ ఈ కేంద్రాలను ప్రారంభించారు.

ఉచితంగా నమోదు..
ప్రభుత్వం తొలినాళ్లలో చేపట్టిన సామూహిక ఆధార్ నమోదు మినహాయించి ఉచితంగా ఆధార్ నమోదు అరుదనే చెప్పాలి. ఆధార్ ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు ఆన్‌లైన్ కేంద్రాల్లో నిర్ధిష్ట రుసుముతో నమోదు ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. ఆపై కలర్ ప్రింట్ అంటూ మొత్తం రూ.100 వదిలేవి. ఇప్పుడు పోస్టాఫీసులలో కొత్త ఆధార్ నమోదు ఉచితంగా చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. మొత్తం మీద కొత్త ఆధార్‌తో పాటు సవరణలు చేసిన కలర్ ప్రింట్ ఆధార్ కార్డు చేతికిరావాలంటే రూ.25 చెల్లించాల్సి ఉంటుంది. అయితే తప్పొప్పుల సవరణకు అదనంగా రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.