హ‌ఠాత్తుగా రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన డివిలియ‌ర్స్

ab de villiers announces retirement from international cricket

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ద‌క్షిణాఫ్రికా క్రికెట‌ర్ ఏబీ డివిల‌య‌ర్స్ అంత‌ర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. ఎలాంటి హంగూ ఆర్బాటాలు లేకుండా హ‌ఠాత్తుగా త‌న రిటైర్మెంట్ నిర్ణ‌యం వెల్ల‌డించాడు డివిలియ‌ర్స్. ఈ రోజు ఓ పెద్ద నిర్ణ‌యం తీసుకున్నాను అని ట్విట్ట‌ర్ లో ప్ర‌క‌టించాడు. తాను క్రికెట్ కు వీడ్కోలు ప‌లుకుతున్న‌ట్టు వీడియో ద్వారా తెలియజేశాడు. అయితే దేశ‌వాళీ క్రికెట్ ఆడ‌తాన‌ని తెలిపాడు. 2004లో 20 ఏళ్ల వ‌య‌సులో ద‌క్షిణాఫ్రికా త‌ర‌పున అంత‌ర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన డివిలియ‌ర్స్ ఎన్నో రికార్డులు సృష్టించాడు. వ‌న్డే క్రికెట్ లో వేగ‌వంత‌మైన 50, 100, 150 ప‌రుగులు సాధించిన ఆట‌గాడిగా, టెస్ట్ క్రికెట్ లో ద‌క్షిణాఫ్రికా త‌ర‌పున వేగ‌వంత‌మైన సెంచ‌రీ, హాఫ్ సెంచ‌రీలు సాధించిన ఆట‌గాడిగా రికార్డులు నెల‌కొల్పాడు.

వికెట్ కీప‌ర్, బ్యాట్స్ మెన్ గా కెరీర్ ఆరంభించిన డివిల‌య‌ర్స్ మిడిలార్డ‌ర్ లో ఎక్కువ‌గా ఆడాడు. మైదానం న‌లువైపులా షాట్లు కొట్టే డివిలియ‌ర్స్ ను స‌హ‌చ‌రులు ముద్దుగా మిష్ట‌ర్ 360 అని పిలుస్తుంటారు. ఈ ఏడాది మార్చిలో డివిల‌య‌ర్స్ త‌న చివ‌రి టెస్ట్ ఆడాడు. ఫిబ్ర‌వ‌రిలో భార‌త్ పై చివ‌రి వ‌న్డే ఆడాడు. ఐపీఎల్ లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న డివిలియ‌ర్స్ కు భార‌త్ తో ప్ర‌త్యేక అనుబంధం ఉంది. 2012లో తాజ్ మ‌హ‌ల్ వ‌ద్ద డానియెల్లీకి ప్రేమ ప్ర‌తిపాద‌న చేసిన డివిలియ‌ర్స్ త‌న‌కు మ‌రో కొడుకు పుడితే తాజ్ అని పేరు పెడ‌తాన‌ని ఇటీవ‌ల చెప్పాడు. భార‌త కెప్టెన్, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ స‌హ‌చ‌ర ఆట‌గాడు విరాట్ కోహ్లీ అంటే డివిల‌య‌ర్స్ కు ఎంతో ఇష్టం. కోహ్లీ కూడా డివిలియ‌ర్స్ ను ఎంత‌గానో ఇష్ట‌ప‌డ‌తాడు. ఒక త‌ల్లికి పుట్ట‌ని అన్న‌ద‌మ్ములం మేమని డివిలియ‌ర్స్ గురించి చెబుతుంటాడు కోహ్లీ.