TV9 నుంచి రవి ప్రకాశ్ ఔట్…కొత్త సీఈవో, సీవోవో నియామకం

టీవీ9 కొత్త సిఈఓగా మహేంద్ర మిశ్రాను నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకొంది. కొత్త సీఓఓగా సింగారావును నియమించారు. కొద్దిసేపటి క్రితం సమావేశమైన డైరెక్టర్లు.. రవి ప్రకాష్‌ను టీవీ9 సీఈవో పదవి నుంచి తొలగిస్తూ చేసిన తీర్మానాన్ని ఆమోదించారు. మరోవైపు గొట్టిపాటి సింగారావును సీవోవో (చీఫ్‌ ఆపరేటింగ్ ఆఫీసర్‌)గా నియమిస్తూ ఏబీసీఎస్ డైరెక్టర్లు బోర్డు తీర్మానం చేసింది. మహేంద్ర మిశ్రా టీవీ9 సీఈవోగా వెంటనే బాధ్యతలు తీసుకున్నారు. కాగా, మహేంద్ర మిశ్రా ప్రస్తుతం టీవీ9 కన్నడ ఎడిటర్‌గా ఉన్నారు. అలాగే గొట్టిపాటి సింగారావు గతంలో మా టీవీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం 10 టీవీ సీఈవోగా ఉన్నారు గొట్టిపాటి సింగారావు. ఈ విషయాన్ని ఏబీసీఎల్ డైరెక్టర్లు కొద్దిసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రెండు రోజులుగా టీవీ9లో నాటకీయ పరిణామాలు నెలకొన్నాయి. టీవీ9 కొత్త యాజమాన్యం అలంద మీడియాకు, రవి ప్రకాశ్ మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. కంపెనీలో 90శాతం వాటా ఉన్న తమను, కేవలం 8శాతం వాటా ఉన్న రవి ప్రకాశ్ పట్టించుకోవడం లేదని.. తమకు తెలియకుండానే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు తన సంతకాన్ని ఫోర్జరీ చేసి సంస్థ నిధులను మళ్లించారని అలంద మీడియా కంపెనీ కార్యదర్శి కౌశిక్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌, ఫైనాన్స్‌ డైరెక్టర్‌ మూర్తి, సినీనటుడు శివాజీపై క్రైమ్ పోలీసులు కేసునమోదు చేశారు. విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు జారీచేశారు. అంతేకాదు టీవీ9 కార్యాలయంతో పాటు రవిప్రకాశ్ ఇంట్లో సోదాలు చేశారు పోలీసులు.