హిందూపురం వైసీపీలో మరో కృష్ణుడు..కంట తడి పెట్టిన నవీన్ !

వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌విశ్చల్ తాజాగా అజ్ఞాతం లోకి వెళ్ళిన విషయం తెల్సిందే. ఇటీవల స్పార్క్ సర్వే బృందాన్ని కిడ్నాప్ చేసి దాడి చేశారని వైకాపా నియోజకవర్గ సమన్వయ కర్త నవీన్‌నిశ్చల్‌తోపాటు 13 మంది వైకాపా నాయకులుపై కేసు నమోదైన విషయం విధితమే. అయితే తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన మైనార్టీ నేతను వైకాపాలోకి చేర్చుకుని తనను ఇబ్బందులకు గురి చేసే విధంగా జరుగుతున్న చర్యలు ఎంతో బాధ కలిగిస్తున్నాయని ఆపార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం తన నివాసంలో నిర్వహించిన మైనార్టీల ఆత్మీయ సమావేశంలో తాజా పరిణామాలను విశదీకరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయగా మైనార్టీలు వెన్నుదన్నుగా నిలిచి గుర్తింపు తెచ్చారని రాజకీయంగా తనకున్న శత్రువులు పలుమార్లు దాడికి ప్రయత్నించినప్పటికీ మైనార్టీ యువకులు రక్షణగా నిలిచారన్నారు. ఇకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా టికెట్ తనకు దక్కేవిధంగా మైనార్టీలు గతంలో తరహాలోనే ఆకాంక్షించాలని, ఇందుకు అవసరమైతే మద్దతుగా కార్యక్రమాలు చేపట్టాలని కోరినట్లు తెలుస్తోంది. 2019లో ఎన్నికల్లో నాకు ఒక్క అవకాశం ఇవ్వండి’ అంటూ పురం వైసీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్‌ ఓ దశలో కంటతడి పెట్టి ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అవసరమైతే పార్టీలోకి వచ్చే మైనార్టీ నేతను కూడా కలిసి నవీన్‌నిశ్చల్ పార్టీ కోసం కృషి చేస్తున్న వైనాన్ని చెప్పాలో వద్దో అన్న అంశంపై చర్చసాగినట్లు తెలుస్తోంది.

hindupur mla naveen nischal

ఇకపోతే నవీన్‌నిశ్చల్‌ను వ్యతిరేకిస్తున్న కొందరు ఈ సమావేశ వీడియో ను సోషియల్ మీడియాలో వైరల్ చేస్తున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టమన్నా సిద్ధమని, కానీ ఇన్ని రోజులుగా పార్టీని నమ్ముకుని ఉన్న తనను కాదని, ఇప్పుడు మరొకరికి అవకాశం ఇస్తామంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఒకానొక దశలో కన్నీటి పర్యంతమయ్యారు. అయితే అంతర్గత సమావేశంలో పాల్గొన్న మైనార్టీ నాయకులు, పార్టీ నాయకులు కంట తడిపెట్టి తమ ప్రాణాలైనా అడ్డంగా పెట్టి గెలిపించుకుంటామంటూ నవీన్‌ నిశ్చల్‌కు భరోసా ఇచ్చారు. తాజా పరిణామాలు వైకాపాలో తీవ్ర దుమారం రేపుతోంది. కాగా టీడీపీ అబ్దుల్‌ఘనీ చేరిక ఇక లాంఛనప్రాయమే అన్న ఉద్దేశంతోనే నవీన్‌నిశ్చల్ తాజాగా తన రాజకీయ భవితవ్యంపై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంతర్గత సమావేశం హిందూపురంలో వైసీపీతోపాటు, టీడీపీ, ప్రజాసంఘాల్లో చర్చనీయాంశంగా మారింది.