Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సినీ సెలబ్రిటీలతో ఓ మాట మాట్లాడడం, సినిమా బాగుందనో, బాగోలేదనో, వ్యక్తిగత ప్రవర్తన గురించో నేరుగా వారికే చెప్పడం అనేది సామాన్యులకు గతంలో జరగని పని. తమను ఎవరు విమర్శిస్తున్నారో, ఎవరు పొగుడుతున్నారో సినిమా వారికీ తెలిసేది కాదు. ఏదైనా సినిమా బాలేనప్పుడో, మరేదైనా వ్యతిరేక సంఘటన జరిగినప్పుడో సామాన్యులు తమను విమర్శిస్తారు అని సెలబ్రిటీలకు తెలుసు కానీ ఆ విమర్శలు ఎలా ఉంటాయో తెలిసేది కాదు. కాబట్టి అలాంటి వాటిపై వాళ్లు స్పందించేవారూ కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సినిమా జనమందరూ సోషల్ మీడియా ద్వారా నెటిజన్లకు చేరువవుతున్నారు. తమ సినిమా సంగతులు, అభిప్రాయాలూ వెల్లడిస్తున్నారు. నెటిజన్లు చేసే పొగడ్తలు వింటున్నారు. వారి అభిమానాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. అయితే సోషల్ మీడియా సెలబ్రిటీలపై ప్రశంసలకే పరిమితంకాదు.
నటీనటులును, దర్శక, నిర్మాతలను, సినిమాకు సంబంధించి ఇతర విభాగాల వారిని అనేక కారణాలతో ఎందరో అభిమానించినట్టుగానే ఏ కారణం లేకపోయినా… వారిని వ్యతిరేకించేవారూ, వారిపై విమర్శలు గుప్పించేవారూ చాలా మందే ఉంటారు. అలాంటి వారు ఇప్పుడు నెట్ లో సినిమా వాళ్లపై తమ అకారణద్వేషం ప్రదర్శిస్తూ ఉంటారు. తమకు ఇష్టం వచ్చిన కామెంట్స్ చేస్తుంటారు. ఇలాంటి అనుభవమే బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ కు ఎదురయింది. ఓ నెటిజన్ అభిషేక్ ను కించపరిచేలా కామెంట్ చేయగా… ఆయన ఇలాంటివి పట్టించుకోవడమెందుకులే అని ఊరుకోకుండా హుందా అయిన జవాబిచ్చి ఆ నెటిజన్ నోరు మూయించాడు.
బాబీడియోల్ అనే నెటిజన్ అభిషేక్ బచ్చన్ ను, క్రికెటర్ స్టూవర్ట్ బిన్నీని పోలుస్తూ ఓ ట్వీట్ చేశాడు. క్రికెటర్ స్టూవర్ట్ బిన్నీ, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ఒకేరకం. అర్హులు కాకపోయినప్పటికీ వీరిద్దరికీ అందమైన భార్యలు దొరికారు. తమ తండ్రుల పాపులారిటీని వాడుకుని ఒకరు సినిమాల్లో, మరొకరు క్రికెట్ లోకి వచ్చారు. ఇద్దరూ పనికిరానివాళ్లే. ఇది నిజమనిపిస్తే మీరూ రీట్వీట్ చేయండి అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ అభిషేక్ కంటపడడంతో ఆయన స్పందించాడు. ఆ నెటిజన్ ను ఉద్దేశిస్తూ…
నా స్థానంలో నువ్వుండి ఒక మైలు ప్రయాణించి చూడు. నువ్వు పది అడుగులు నడవగలిగినా నేను సంతోషిస్తాను. నీ ట్వీట్ ను బట్టి చూస్తే నువ్వు నాలా ప్రయాణించలేవని అర్ధమవుతోంది. కాబట్టి నిన్ను నువ్వు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించు. ఇతరుల గురించి చింతించకు. ఎవరి ప్రయాణం వారిది అన్న విషయం దేవుడికి తెలుసు… అని ట్వీట్ చేశాడు. అభిషేక్ ట్వీట్ పై ఆ నెటిజన్ స్పందించాడు. అభి… నేనేదో సరదాగా అన్నాను. థియేటర్లో నీ సినిమాలు బాగా ఆడకపోయినా నీ డ్రెస్సింగ్ స్టయిల్ అంటే నాకిష్టం. ఏదో జోక్ చేశాను. ఇందుకు నువ్వు బాధపడి ఉంటే క్షమించు. బచ్చన్ కుమారుడివైన నీపైనా, సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ పైనా ఎంత ఒత్తిడి ఉంటుందో నాకు తెలుసు. క్షమించు అని కోరాడు.