వైసీపీలో చేరేందుకు కడపకు కోట్ల : కాన్వాయ్‌ ప్రమాదం ముగ్గురు మృతి

Accident At Kotla Convoy

కాంగ్రెస్‌ పార్టీని వీడిన కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సోదరుడు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి తాను వైసీపీలో చేరుతున్నట్టు రెండు రోజుల కిందట ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వైసీపీలో చేరేందుకు తన అనుచరులతో కలిసి భారీ కాన్వాయ్‌ తో ఆయన కడపకు వెళ్తుండగా అందులో అపశ్రుతి చోటు చేసుకుంది. కాన్వాయ్‌ లో వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో అక్కడిక్కడే ముగ్గురు కార్యకర్తలు మృతి చెందారు. కోడుమూరు నుంచి హర్షవర్ధన్ రెడ్డి కడపకు గురువారం ఉదయం బయలుదేరిన అనతరం ఓర్వకల్లు పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో పంచలింగాలకు చెందిన డ్రైవర్‌ రాఘవేంద్ర, నిర్మల్‌నగర్‌ కు చెందిన బి. రాము, చిన్ని రాముడు అక్కడికక్కడే మృతి చెందారు. దేవనకొండ మండలం ఈదుల దేవరబండకు చెందిన లింగన్న, నిర్మల్‌నగర్‌కు చెందిన పరశురాం, లక్ష్మన్నలకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో పలువురు మరికొందరికి కార్యకర్తలకు గాయాలు కాగా, వారిని వైద్యం కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఘటనా స్థలికి చేరుకుని, సహాయక చర్యలు ప్రారంభించారు. కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.