ప్రముఖ పంజాబీ నటుడు, గణతంత్ర వేడుకల అల్లర్ల కేసులో దోషి దీప్ సిద్ధూ రోడ్డు ప్రమాదంలో మరణించారు. మంగళవారం స్నేహితురాలితో కలిసి స్కార్పియో వాహనంలో ఢిల్లీ నుంచి భటిండా వెళ్లున్నారు. ఈ క్రమంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న భారీ ట్రక్కును వెనక నుంచి బలంగా ఢీకొట్టారు. కారు డ్రైవర్‌వైపు భాగమంతా ట్రక్కులోకి చొచ్చుకుపోయింది. దీంతో సిద్ధుకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
పంజాబ్ సీఎం చరణ్‌జిత్‌సింగ్ చన్ని తదితరులు దీప్ మృతి పట్ల సంతాపం తెలిపారు. 2021 జనవరి 26న గణతంత్ర వేడుకల సందర్భంగా సాగు చట్టాల రద్దు డిమాండ్‌తో రైతులు ఢిల్లీలో చేసిన ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొని సిద్ధు వార్తల్లో నిలిచారు. ఎర్రకోటపై దాడికి రైతులను ప్రేరేపించారంటూ సిద్ధూపై కేసు నమోదైంది. ఫిబ్రవరి 9న హరియాణాలోని కర్నాల్‌లో ఆయనను అరెస్టు చేశారు. బెయిల్‌పై బయటికి వచ్చినా, చార్జిషీటు దాఖలు అనంతరం మేలో మళ్లీ అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు. పంజాబ్‌లోని ముక్త్సర్కు చెందిన దీప్ నటునిగా మారకముందు లాయర్‌గా కూడా పని చేశారు.