విజయశాంతికి రమ్య వేసిన రాజకీయ రహదారి.

Actress Karnataka Mp ramya created way for vijayashanthi in congress to lead

Posted October 13, 2017 at 10:48 

విజయశాంతి … ఏ తెలంగాణ రాష్ట్రం కోసం అయితే పోరాడడానికి సినిమాలు వదులుకుని వచ్చిందో అదే తెలంగాణ వచ్చాక ఆమె రాజకీయ భవిష్యత్ అయోమయంలో పడింది. కాంగ్రెస్ లో పాతుకుపోయిన నాయకులే ఒకరితో ఒకరు కొట్టుకుని నానా యాగీ చేస్తున్నారు. ఇక ఎన్నికలప్పుడు ఆ పార్టీలోకి వెళ్లిన ఆమెని పట్టించుకునేది ఎవరు ?. ఈ విషయం విజయశాంతికి అర్ధం అయ్యిందో లేదో గానీ రాజకీయ పరిణామాల్ని చురుగ్గా పసిగట్టే తెలంగాణ సీఎం కెసిఆర్ కి తెలిసిపోయింది. అందుకే తెరాస తరపున ఆమెకి ఆహ్వానం కూడా అందిందట. దీనిపై ఓ నిర్ణయం తీసుకునేలోపే కాంగ్రెస్ హైకమాండ్ నుంచి విజయశాంతికి అనూహ్యమైన రీతిలో కబురు వచ్చిందట. తెలంగాణ లో పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టిన సోనియా, రాహుల్ ఆమెతో నేరుగా మాట్లాడినట్టు తెలుస్తోంది. అంతే కాక తెలంగాణాలో పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించడానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేశారట. దీంతో విజయశాంతి ఉబ్బితబ్బిబ్బు అయ్యారట. అసలు ఏ ప్రయత్నం చేయకుండానే కాంగ్రెస్ హైకమాండ్ ఇంత ఆదరణ చూపించడం వెనుక కారణం ఏంటా అని ఆరా తీస్తే పక్క రాష్ట్రపు హీరోయిన్ చేసిన పని తనకి కూడా కలిసి వచ్చిందని అర్ధం అయ్యిందట.

డీటెయిల్స్ లోకి వెళితే .. కర్ణాటక నటి ,మాజీ ఎంపీ రమ్య కి ఇటీవల కాంగ్రెస్ జాతీయ స్థాయిలో పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని అప్పగించారు. మొదట్లో ఆమె పనితీరు మీద పెద్దగా అంచనాలు ఏమీ పెట్టుకోలేదు. అయితే కాలం గడిచేకొద్దీ సోషల్ మీడియా పరంగా మోడీ వ్యతిరేక, బీజేపీ వ్యతిరేక కధనాలు దేశవ్యాప్తంగా పెరగడానికి ఆమె చేసిన కృషి కళ్ళకు కట్టినట్టు రాహుల్ అండ్ కో కి అర్ధం అయిపోయిందట. అందుకే ఒకప్పుడు ఇద్దరు ముగ్గురు పనిచేసే చోట 85 మందితో ఆమె పని చేయించినా ఆర్ధికంగా ఏ ఇబ్బంది రాకుండా సపోర్ట్ చేశారట. సినిమా వాళ్లకి పనులు అప్పగిస్తే, మరీ ముఖ్యంగా ప్రచార అంశాల్లో వారి జడ్జ్ మెంట్ బాగుంటుంటుందని డిసైడ్ అయ్యారట సోనియా , రాహుల్. అందుకే తెలంగాణాలో ప్రచార బాధ్యతలు విజయశాంతికి అప్పగించాలని చూస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తే మంచి పదవి ఇస్తామని కూడా 10 జన్ పథ్ నుంచి విజయశాంతికి హామీ వచ్చిందని సమాచారం. మొత్తానికి ఏ సంబంధం లేకపోయినా రమ్య విజయశాంతికి రాజకీయ రహదారి వేసేసింది.

SHARE