అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి

అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి

భలే భలే మగాడివోయ్‌ అంటూ యూత్‌ను ఆటపట్టించిన అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి. అందం అభినయంతో టాలీవుడ్‌లో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. తనదైన నటనతో అంది వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటోంది. లావణ్య త్రిపాఠికి హ్యాపీ బర్త్‌డే అంటోంది.1990 డిసెంబర్ 15న ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో జన్మించింది లావణ్య త్రిపాఠి. ఆమె తండ్రి న్యాయవాది.

తల్లి టీచర్. ఆమెకు ఇద్దరు తోబుట్టువులు, ఒక అన్న, అక్క ఉన్నారు. లావణ్య ప్రాథమిక విద్యాభ్యాసం అంతా డెహ్రాడూన్ లో సాగింది. ముంబయ్ లో రిషీ దయారామ్ నేషనల్ కాలేజ్ లో ఎకనామిక్స్ లో లావణ్య త్రిపాఠి డిగ్రీ పూర్తి చేశారు. భరతనాట్యంలో శిక్షణ పొందిన లావణ్య త్రిపాఠి ‘షో బిజ్’లో అడుగు పెట్టాలని భావించింది. అందుకనుగుణంగా 2006 లో మిస్ ఉత్తరాఖండ్ టైటిల్ గెలిచుకుంది. ఆ తరువాత మోడల్‌గా రాణిస్తూ యాక్టింగ్‌ కరియర్‌ను మొదలుపెట్టింది.

తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి ఒక యాడ్‌లో నటించింది. ఫెయిర్ & లవ్లీ , బినాని సిమెంట్‌తో సహా కొన్ని టాప్‌ బ్రాండ్‌ల యాడ్స్‌తో ఆకట్టుకుంది. “, ష్‌…కోయీ హై,సీఐడీ, ప్యార్ కా బంధన్” లాంటి హిందీ టీవీ సీరియల్స్ లో లావణ్య నటించింది.2012లో హీరోయిన్‌గా తెలుగు తెరపై తళుక్కుమంది లావణ్య. హను రాఘవపూడి దర్శకత్వంలో ‘అందాల రాక్షసి’ మూవీతో లావణ్య తొలిసారి బిగ్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది.

డెబ్యూమూవీతోనే అదరగొట్టేసింది. విమర్శకుల ప్రశంసలతోపాటు వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. లావణ్య నటించిన “దూసుకెళ్తా, మనం, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా, లచ్చిమిదేవికి ఓ లెక్కుంది, శ్రీరస్తు శుభమస్తు, మిస్టర్, రాధ, యుద్ధం శరణం, ఉన్నది ఒకటే జిందగీ, సాయి ధరమ్ తేజ్‌తో ఇంటెలిజెంట్, అంతరిక్షం 9000 కెఎంపీహెచ్, అర్జున్ సురవరం, ఏ1 ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా” చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.

ముఖ్యంగా టాలీవుడ్‌ మన్మధుడు నాగార్జున సరసన నటించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ మూవీ లావణ్యకు మంచి పేరు తీసుకొచ్చింది.. అలాగే నాని జోడీగా ఆమె నటించిన ‘భలే భలే మగాడివోయ్’ కూడా విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా రితేష్ రానా తెరకెక్కించే క్రైమ్ కామెడీలో లావణ్య నటిస్తోంది. బ్రహ్మంతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ఇందులో ఆమె ఔత్సాహిక పాత్రికేయురాలిగా నటించింది. అలాగే మాయవాన్” అనే మరో తమిళ మూవీలో కూడా నటించింది లావణ్య.