ఆత్మకూరు తాత్కాలిక ఇన్చార్జిగా ఆదాల ప్రభాకరరెడ్డిని సీఎం ప్రకటించారు. దీని వెనుక మంత్రి నారాయణ ఉన్నారని ఆయనే ఆదాల ప్రభాకర్‌రెడ్డితో పాటు సోమవారం ఆత్మకూరులో పార్టీ సమావేశం నిర్వహించి మరీ ప్రకటించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన పార్టీ నేత కన్నబాబు పార్టీకి రాజీనామా సిద్డంయ్యరని సమాచారం. విషయం తెలుసుకున్న టీడీపీ అధిష్టానం పలువురు నేతలను ఆయన ఇంటికి పంపి బుజ్జగిస్తున్నట్లు సమాచారం. అయితే ఈబిజ్జగిమ్పులకి లొంగని కన్నబాబు చివరికి ఆమరణ దీక్షకు దిగారని తెలుస్తోంది. ఆత్మకూరు నియోజకవర్గానికి ఆదాల ప్రభాకరరెడ్డిని ఇన్ఛార్జిగా నియమిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిన్న రాత్రి నెల్లూరు నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయం ఎదుట దీక్షకు దిగారు. తన అనుచరులతో కలిసి రాత్రి 8.30 సమయంలో టిడిపి కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఎన్టిఆర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడే ఆమరణ దీక్షకు కూర్చున్నారు. పార్టీలో పనిచేసేవారికి న్యాయం జరగలేదంటూ ఆయన బోరున విలపించందం ఇప్పుడు కాస్త చర్చనీయాంశం అయింది.
ఎప్పటి నుంచో పార్టీలో ఉండి పనిచేస్తున్నామని, పార్టీ తమకు అన్యాయం చేస్తుందన్నారు. పార్టీని నమ్ముకున్న తన లాంటి వారిని కాదని ఆదాలకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.. అందుకే ఎన్‌టిఆర్‌కు తన బాధను తెలియ జేస్తున్నానని కన్నీటి పర్యంతమయ్యారు. ఆత్మకూరు పార్టీ నాయకులకు ఎవరికీ చెప్పకుండా మంత్రి నారాయణ, ఇతర నాయకులు ఆత్మకూరులో పర్యటిస్తున్నారని, ఇంత కన్నా దారుణం ఎక్కడుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మకూరులో పార్టీని కాపాడుకోవడానికి ప్రతి కార్యకర్త ముందుకు రావాలని తనకు న్యాయం జరిగే వరకూ ఆమరణ దీక్ష కొనసాగిస్తానంటూ స్పష్టం చేశారు. కన్నబాబు అనుచరులు పెద్ద ఎత్తున టిడిపి కార్యాలయానికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కాగా కన్నబాబు గత ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి మేకపాటి గౌతంరెడ్డి చేతిలో ఓడిపోయారు.