పందిని ప్రధాన పాత్రగా తీసుకుని వెరైటీ సినిమాలు తీసే దర్శకుడు రవి బాబు , సురేష్ ప్రొడక్షన్స్ తో కలిసి చేసిన సినిమా “అదుగో “. ఈ సినిమా తీయడానికి మూడేళ్లు పట్టింది. ఇక ఈ సినిమా ప్రమోషన్ కోసం పందిని చేతుల్లో పట్టుకుని రవి బాబు స్టూడియోల వెంట తిరగడం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ విశేషాల నడుమ నేడు విడుదల అయిన “అదుగో” సినిమా ఎలా వుందో చూద్దాం.
అదుగో కథ…
ఓ పల్లెలో బంటీ అనే పందిపిల్లని పెంచుకుంటూ ఉంటాడు ఓ పిల్లవాడు. ఓ రోజు హైదరాబాద్ నుంచి ఆ పల్లె మీదుగా వెళుతున్న ఓ రౌడీ గ్యాంగ్ ఆ పందిపిల్లని తమతో పాటు బలవంతంగా ఆ పందిపిల్లని తీసుకెళతారు. దాన్ని వెదుక్కుంటూ పట్నం వస్తాడు ఆ పిల్లవాడు. అయితే ఆ పిల్లవాడి కన్నా ఎక్కువగా కొన్ని రౌడీ గ్యాంగ్ లు , ఓ ప్రేమికుడు కూడా ఆ పందిపిల్ల కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతుంటారు. ఇంతకీ ఆ పందిపిల్ల దగ్గర ఏముంది ? చివరకు ఏమైంది అన్నదే మిగిలిన కథ.
అదుగో రివ్యూ & విశ్లేషణ….
”అదుగో” సినిమా పబ్లిసిటీ దృష్ట్యా ప్రేక్షకుల దృష్టిని పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ రవి బాబు హిస్టరీ చూసి ఏవో మెరుపులు వుంటాయని ఆశించారు. గతంలో ఆయన తీసిన అనసూయ లాంటి సినిమాల ప్రభావం ఈ అంచనాల వెనుక లేకపోలేదు. హాలీవుడ్ సినిమాల ప్రభావం ఆయన టేకింగ్ లో కనిపిస్తుంటుంది. ఇప్పుడు అదుగో విషయంలో కూడా అదే స్ఫూర్తి ఉండొచ్చు. కానీ అనుకున్న కథ , కథా గమనం మాత్రం షో మొదలైన కొద్దిసేపటికే గాడి తప్పింది. ఆరంభం చూస్తే ఇదేదో ఇంటరెస్టింగ్ ఐడియా అనిపించినా ,సెంట్రల్ పాయింట్ కి సంబంధం లేని లవ్ స్టోరీ వచ్చాక సీన్ మారిపోయింది. లవ్ స్టోరీ పర్లేదు అనుకున్నా హీరో , హీరోయిన్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఇక ఆ లవ్ స్టోరీ కి పొడిగింపుగా వచ్చిన క్రిమినల్ గ్యాంగ్స్ వ్యవహారం వచ్చాక వినోదం అనుకుని దర్శకుడు చేసింది ఏ ఒక్కటీ ప్రేక్షకుడిని ఆకట్టుకోలేకపోయింది.
సరే ఏదో కామెడీకి ట్రై చేస్తున్నాడు అనుకుంటే మధ్య మధ్యలో పిట్టల్ని కాల్చినట్టు కాల్చి ప్రాణాలు తీసుకోవడం అన్నది ఎక్కడా మ్యాచ్ కాలేదు. కధకి సెంట్రల్ పాయింట్ బలంగా లేకపోవడంతో మిగతా వ్యవహారం అంతా బోరింగ్ గా తయారు అయ్యింది. అసలు రౌడీ గ్యాంగ్ ఆ పందిపిల్లని అంత బలవంతంగా ఎందుకు సిటీ కి తీసుకొచ్చారు అన్న పాయింట్ కి అర్ధమే లేదు. దీంతో మొత్తం వ్యవహారం కావాలని తెచ్చిపెట్టినట్టు అనిపిస్తుంది తప్ప ఎక్కడా ప్రేక్షకుడు ఎంజాయ్ చేయలేడు. సీన్స్ బలంగా లేకపోవడంతో ఇక పందిపిల్లతో చేసిన గ్రాఫిక్స్ సీన్స్ కూడా తేలిపోయాయి. మొత్తానికి అదుగో ఓ వృధా ప్రయత్నం గా మిగిలిపోతుంది.