Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విదేశీయులను, ముఖ్యంగా ఆసియాకు చెందిన వారిని అవమానించడం అమెరికాకు బాగా అలవాటు. ఆసియాలోని వివిధ దేశాలకు చెందిన ప్రజలకు అమెరికా ఎయిర్ పోర్టుల్లో తరచుగా జాత్యహంకార వివక్ష ఎదురవుతుంటాయని చెప్పుకుంటుంటారు. అమెరికాను చూసి స్ఫూర్తిపొందారో ఏమో కానీ తాజాగా కువైట్ ఎయిర్ పోర్ట్ అధికారులు కూడా జాత్యహంకార వైఖరి ప్రదర్శించారు. భారతీయులపై అభ్యంతర కర వ్యాఖ్యలు చేశారు. అయితే వారు అవమానించింది సాధారణ వ్యక్తులను కాదు… ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీని, అతని బృందాన్ని. కచేరి నిమిత్తం తన బృందంతో కలిసి ఆదివారం కువైట్ కు వెళ్లిన అద్నాన్ సమీకి అక్కడి విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురయింది. ఇమ్మిగ్రేషన్ అధికారులు అద్నాన్ సమీని, అతని బృందాన్ని ఉద్దేశించి తీవ్ర అభ్యంతరకర రీతిలో భారతీయ కుక్కలు అని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని అద్నాన్ ట్విట్టర్ లో వెల్లడించారు.
కువైట్ ఇమ్మిగ్రేషన్ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కు, కువైట్ లోని భారత దౌత్యకార్యాలయానికి ట్వీట్ చేశారు. ఎంతో ప్రేమతో మీ నగరానికి వచ్చాం. కానీ మీరు మాకు ఎలాంటి మద్దతూ ఇవ్వలేదు. అకారణంగా కువైట్ ఎయిర్ పోర్టులోని ఇమ్మిగ్రేషన్ అధికారులు మాతో అసభ్యకరంగా ప్రవర్తించారు. మా వాళ్లని భారతీయ కుక్కలు అంటూ అనుచిత వ్యాఖ్యలుచేశారు. ఈ విషయం గురించి మీకు ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంత పొగరుగా ప్రవర్తించడానికి వారికి ఎంత ధైర్యం అని అద్నాన్ ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ పై సుష్మాస్వరాజ్ స్పందించారు. మీరు నాతో ఫోన్ లో మాట్లాడండి అని ట్వీట్ చేశారు. దీనిపై ప్రతిస్పందించిన అద్నాన్ మంచిమనసున్న సుష్మాస్వరాజ్ కు తన ధన్యవాదాలని, ఆమె అర్థం చేసుకుని తనకు, తన బృందానికి సాయం చేస్తున్నారని, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా… మనకు వెంటనే సాయంచేసే సుష్మ మన విదేశాంగ మంత్రిగా ఉన్నందుకు గర్వపడుతున్నా అని అద్నాన్ ట్వీట్ చేశారు.