Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సరిహద్దుల్లో దేశం కోసం పహారా కాసే సైనికులకు, సమాజంలో పౌరుల ప్రాణాలకు రక్షణగా నిలిచే పోలీసులకు శిక్షణలో భాగంగా ఓ సందేశం ఇస్తుంటారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించడానికి సైతం వెనకాడవద్దన్నది ఆ సందేశం. అయితే శిక్షణలోనూ, తర్వాతి విధుల్లోనూ పదే పదే వినిపించే ఈ సందేశాన్ని నిజానికి పాటించే వారు ఎక్కువమంది ఉండరు. ప్రాణాలు పోయే సందర్భాలు వచ్చినప్పుడు తప్పిచుకుని పోయేందుకే అంతా ప్రయత్నిస్తుంటారు. అది మనిషి సహజ లక్షణం. పోలీసులూ, సైనికులూ కూడా ఇందుకు మినహాయింపు కాదు. కానీ కొందరు మాత్రం విధులు స్వీకరించేటప్పుడు చేసిన ప్రమాణాన్ని తుచ తప్పకుండా పాటిస్తారు. తమ ప్రాణాలు పోతాయని తెలిసి కూడా… ధైర్యంగా మందుడుగు వేసి అమరవీరులుగా నిలిచిపోతారు.
అఫ్ఘనిస్థాన్ కు చెందిన పోలీస్ అధికారి బసమ్ పాచా ఇలాగే విధినిర్వహణలో ప్రాణాలర్పించి నిజమైన హీరోగా నిలిచారు. దేశ రాజధాని కాబూల్ లో ఓ ఆత్మాహుతి దాడిని ఎదుర్కునేందుకు బసమ్ పాచా ప్రాణత్యాగం చేసి వందలమంది జీవితాలను నిలబెట్టారు. ఘటన వివరాల్లోకి వెళ్తే… కాబూల్ లోని ఓ ఫంక్షన్ హాల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్న పెళ్లిని ఓ ఉగ్రవాది లక్ష్యంగా చేసుకున్నాడు. అతిథులంతా హాజరై పెళ్లి వేడుకను తిలకిస్తుండగా… ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు ఒంటినిండా బాంబులు చుట్టుకుని హాల్ వైపు పరిగెత్తడం ప్రారంభించాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న బసమ్ పాచా ఆ ఉగ్రవాదిని గమనించాడు. మామూలుగా అయితే పోలీసులు… ఇలాంటి సమయాల్లో ఇతర పోలీసులను పిలిచి అలెర్ట్ చేయడమో… లేదంటే ప్రాణభయంతో అక్కడినుంచి పారిపోవడమో చేస్తారు. కానీ పాచా మాత్రం తన ప్రాణం గురించి ఏమాత్రం ఆలోచించలేదు. పరుగుతీస్తూ సూసైడ్ బాంబర్ వైపు దూసుకెళ్లాడు. రెండు చేతులుతో అతన్ని గట్టిగా పట్టుకున్నాడు. ముష్కరుడు తనను తాను పేల్చుకోవడంతో… అతనితో పాటు పాచా కూడా అక్కడికక్కడే అసువులు బాశాడు.
ఈ ఘటనలో దాదాపు 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 18 మంది గాయపడ్డారు. అదే పాచా కనుక తన ప్రాణాలకు భయపడి ముష్కరుణ్ని అడ్డుకోకపోతే… అతను ఫంక్షన్ హాల్లోకి ప్రవేశించి… భారీగా ప్రాణనష్టం కలిగించేవాడు. బసమ్ పాచా రియల్ హీరో అని అఫ్ఘాన్ మంత్రి నజీబ్ దనీష్ వ్యాఖ్యానించారు. పోలీస్ శాఖ సైతం పాచా త్యాగాన్ని కొనియాడుతోంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఏడుగురు పోలీసులు నిజంగా హీరోలే అని ముఖ్యంగా పాచా నిజమైన హీరో అని పోలీస్ శాఖ సీనియర్ అధికారి బసీర్ ముజాహిద్ ప్రశంసించారు. పాచా ఉగ్రవాదిని అడ్డుకోకపోయిఉంటే ఆ నష్టాన్ని ఊహించలేమని ఆయన వ్యాఖ్యానించారు.