స్వీటు కోసమా సీటు కోసమా…?

After Announcing Political Entry Actor Prakash Raj Meets KTR In Hyd

తన విలక్షణ నటనతో అశేష ప్రేక్షకుల మెప్పు పొందిన సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ప్రజా సేవ చేయాలనే ఉద్దేశ్యతో రాజకీయ ఆరంగేట్రం చేయబోతున్నారు. రెండు రోజుల క్రితం ‘‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరి మద్ధతుతో 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. ఎక్కడి నుంచి అనేది త్వరలోనే ప్రకటిస్తా. వచ్చేది ప్రజా ప్రభుత్వమే’’ అంటూ ట్వీట్ చేసి కలకలం రేపారు. పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని చెప్పారు కానీ, ఏ రాష్ట్రము నుండి అనేదో వెల్లడించలేదు. అయితే, ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారని ఆయనే ట్వీట్ లో పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రకాశ్ రాజ్ టీఆర్ఎస్ పార్టీతో సఖ్యతగా ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. కొద్దిరోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రకాశ్‌ రాజ్‌ ఇటీవల కలిశారు. ముఖ్యమంత్రితో కలిసి అసెంబ్లీకి వచ్చిన ప్రకాశ్‌ రాజ్‌ పలు అంశాలపై ఆయనతో చర్చించినట్లు తెలిసింది. కొన్ని ముఖ్య పార్టీలతో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు దిశగా సీఎం కేసీఆర్‌ సమాయత్తమవుతున్న నేపథ్యంలో ప్రకాశ్‌రాజ్‌ ఆయనను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు ప్రజలు, రాజకీయ నేతలతో మంచి సంబంధాలున్న ప్రకాశ్‌రాజ్‌కు సమన్వయకర్త బాధ్యతలు అప్పగించి ఫ్రంట్‌ను బలోపేతం చేసేలా కేసీఆర్‌ వ్యూహరచన చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అయ్యారు. అంతేకాదు, తన రాజకీయ ప్రయాణానికి స్పూర్తిగా నిలిచిన కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. అదే ట్వీట్‌లో తన రాజకీయ ఆరంభం ఎవరికీ వ్యతిరేకంగా కాదని, సమాజం కోసమని చెప్పారు. పార్లమెంట్‌లో కూడా ప్రజా సమస్యలపై ప్రశ్నించే ఉద్దేశంతోనే ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు ఆయన తెలిపారు. ఎంపీ టికెట్ కోసమే కేటీఆర్‌ను కలిశాడని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున మద్దతు కోసం కలిసుంటాడని అంటున్నారు. చూడాలి ఏమి జరగనుందో !