Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భరత్ అను నేను తో రికార్డులు తిరగరాస్తున్న మహేశ్ బాబు అరుదైన గౌరవం దక్కించుకున్నారు. లండన్ లోని ప్రముఖ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మహేశ్ మైనపు విగ్రహాన్ని ఉంచబోతున్నారు. మహేశ్ ట్విట్టర్ లో స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రఖ్యాతిగాంచిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో భాగం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆర్టిస్ట్ లందరూ దగ్గరుండి నా వివరాలు సేకరించినందుకు ధన్యవాదాలు. అద్భుతః అని మహేశ్ ట్వీట్ చేశారు.
భరత్ అను నేను విడుదలైన రెండు రోజుల్లోనే రూ. 100 కోట్లు వసూలుచేసి రికార్డులు సృష్టించడంతో మహేశ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ సందర్భంగానే మేడమ్ టుస్సాడ్స్ మహేష్ విగ్రహం ఉంచాలని నిర్ణయించింది. మహేశ్ భార్య నమ్రత కూడా ఇన్ స్టాగ్రామ్ లో దీనిగురించి పోస్ట్ చేశారు. నమ్రత పోస్ట్ చేసిన ఫొటోలో మ్యూజియం ఆర్టిస్ట్ లు మహేశ్ కొలతలు తీసుకుంటూ కనిపించారు. త్వరలో ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ లో మహేశ్ మైనపు బొమ్మ రాబోతోంది. గర్వంగా ఉంది….అని హర్షం వ్యక్తంచేశారు. ప్రభాస్ తర్వాత టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం ఉంచబోతోంది మహేశ్ బాబుదే. బాహుబలితో అంతర్జాతీయ స్థాయి పేరుప్రతిష్టలు దక్కించుకున్న ప్రభాస్ మైనపు విగ్రహాన్ని బాహుబలి గెటప్ లోనే మేడమ్ టుస్సాడ్స్ లో ఉంచారు.