వైఫ్ స్వాపింగ్ కి ఒప్పుకోలేదన్న కోపంతో ఓ భర్త తన కట్టుకున్న భార్యను శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురి చేశాడు. గుజరాత్లోని ఘట్లోడియాలో జరిగిన ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాల్లోకి వెళితే 2015లో ఒక జంటకు పెళ్లయింది గత ఏడాది జనవరిలో భర్త తన స్నేహితుల కుటుంబాలతో కలసి మనాలి వెళ్లారు. అక్కడ ‘వైఫ్ స్వాపింగ్’కి ఒప్పుకోవాలని ఆమెపై భర్త ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆమె అంగీకరించలేదన్న కారణంతో తీవ్రంగా కొట్టాడు. తన స్నేహితుల ముందే ఆమెను ఈ విషయం గురించి పదే పదే గుచ్చి గుచ్చి ప్రశ్నించేవాడు. అయినా ఆమె లొంగకపోవడంతో మరింత పాశవికంగా ప్రవర్తించాడు. శృంగార వీడియోలు చూడాలని, ఆ వీడియోల్లో చూపినట్టు నడుచుకోవాలని బలవంతం చేశాడు. ఓ రోజు బార్య మీద దాడి చేశాడు. ఆ తర్వాత ఆమెతో ఖాళీ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకున్నాడు. ఆ తర్వాత తన స్నేహితులతో కలసి ఆమె క్యారెక్టర్ మీద తప్పుడు ముద్ర వేసిన ప్రబుద్దుడు ఆమెను పుట్టింటికి పంపించేశాడు. అనంతరం ఆమెకు విడాకులు ఇస్తున్నట్టు చెప్పాడు. తన భార్య కూడా తనకు విడాకులు ఇవ్వడానికి అంగీకారం తెలిపిందని, అందుకు సంబంధించిన పత్రాల మీద కూడా ఆమె సంతకాలు పెట్టిందంటూ అత్తమామలకు వాట్సాప్లో ఫొటోలు పంపించాడు. ఆ ఫొటోలు చూసిన అత్తమామలు షాక్కు గురయ్యారు. అందులో భర్త నుంచి తనకు జీవితాంతం ఎలాంటి భరణం కూడా అవసరం లేదని ఆమె అంగీకరించి సంతకాలు పెట్టినట్టుగా కూడా పేపర్లు ఉన్నాయి. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు తమ కుమార్తెతో కలసి పోలీసులను ఆశ్రయించారు. అయితే, ఈ తతంగం మొత్తానికి భర్త తరఫు కుటుంబసభ్యులు కూడా సహకరించారని బాధితురాలు పోలీసులకు చేసిన ఫిర్యాదులో తెలిపింది.