అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికాం రంగానికి , ఆటో రంగం కొరకు ఉత్పత్తి-ఆధారిత ప్రోత్సాహకం (పీఎల్‌ఐ) పథక రిలీఫ్ ప్యాకేజీపై కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించిన విషయం తెలిసిందే. టెలికాం సంస్థల స్థూల ఆదాయాలు, స్పెక్ట్రమ్ చెల్లింపులను క్లియర్ చేయడానికి నాలుగు సంవత్సరాల తాత్కాలిక నిషేధాన్ని కేంద్రం ఆమోదించింది. టెలికాం రంగానికి కేంద్రం తీసుకున్న నిర్ణయం ఎంతగానో ఉపశమనాన్ని కల్గించింది. ముఖ్యంగా తీవ్ర అప్పుల ఊబిలో చిక్కుకుపోయినా వొడాఫోన్ ఐడియాకు భారీ ఉపశమనం.
టెల్కోలకు ఇచ్చిన స్పెక్ట్రమ్ చెల్లింపులపై మరో రెండు సంవత్సరాలు పొడింగించడంతో పలు టెలికాం కంపెనీల షేర్లు మార్కెట్‌లో లాభాలను గడించాయి. తాజాగా టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ బుధవారం రోజున బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో సరికొత్త రికార్డులను నమోదుచేసింది. భారతి ఎయిర్‌టెల్ షేర్లు బీఎస్‌ఈలో ఆల్-టైమ్ గరిష్ట స్థాయి రూ. 734 ను తాకింది. అంతేకాకుండా ఇంట్రాడేలో 5శాతం మేర లాభపడింది. భారతి ఎయిర్‌టెల్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్(మూలధన) విలువ రూ. 4 లక్షల కోట్లు దాటింది.
మూలధన విలువ నాలుగు లక్షల కోట్లకు చేరుకున్న పన్నెండవ భారతీయ సంస్థగా ఎయిర్‌టెల్ రికార్డు సృష్టించింది.గతంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్ లిమిటెడ్, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్‌డీఎఫ్‌సి లిమిటెడ్, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, ఐటిసి లిమిటెడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోటక్ మహీంద్రా బ్యాంక్ నాలుగు లక్షల కోట్ల మైలురాయిని సాధించాయి.
గత కొన్ని రోజుల నుంచి టెలికాం షేర్లు లాభాలను గడిస్తున్నాయి. గత పది సెషన్లలో వోడాఫోన్ ఐడియా 45% పైగా పెరిగింది, గత 12 సెషన్లలో భారతీ ఎయిర్‌టెల్ 23% పైగా పురోగమించింది. గత రెండు వారాల్లో రిలయన్స్ కమ్యూనికేషన్స్ కూడా 33% పైగా పెరిగింది. భారతీ ఎయిర్‌టెల్ బీఎస్‌ఈ సెన్సెక్స్ లాభాల కంపెనీలో తొలి స్థానంలో నిలిచింది. దేశ అభివృద్ధికి కీలకమైన టెలికాం కంపెనీలకు సహాయం చేయడం కోసం గత కొన్ని రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం టెలికమ్యూనికేషన్ల శాఖతో అనేక సమావేశాలను ఏర్పాటుచేసింది. దీంతో గత వారం రోజులుగా టెలికాం సంస్థలు లాభాలను గడించాయి.