Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఒకప్పుడు ఎంత సక్సెస్ ఫుల్ హీరోయిన్ కైనా పెళ్లి తర్వాత కెరీర్ ముగిసిపోయేది… ఇక పిల్లలు పుట్టిన తర్వాతయితే తల్లి, వదిన, అక్క పాత్రలకే పరిమితం. కానీ ఇటీవల ట్రెండ్ మారుతోంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా హీరోయిన్లంతా పెళ్లి, పిల్లల తర్వాత కూడా దిగ్విజయంగా కెరీర్ కొనసాగిస్తున్నారు. అయితే ఇలా పిల్లలు పుట్టిన తర్వాత కూడా సినిమాల్లో చిట్టిపొట్టి దుస్తులు వేసుకుని ఎక్స్ పోజింగ్ చేయడం, ముద్దుసన్నివేశాల్లో నటించడంపై విమర్శలూ వ్యక్తమవుతున్నాయి. కానీ ఈ విమర్శలను హీరోయిన్లు పట్టించుకోవడం లేదు… తమను విమర్శిస్తున్నవారికి దీటైన సమాధానం ఇస్తున్నారు. ఇది తమ స్వేచ్ఛని, దానిపై ఇతరుల అభిప్రాయాలతో తమకు పనిలేదని ఎదురుదాడికి దిగుతున్నారు. స్త్రీ, పురుష సమానత్వం దిశగా తాము అడుగులు వేస్తున్నామని కూడా వారు సమర్థించుకుంటున్నారు.
ఆరాధ్య పుట్టిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఐశ్వర్యారాయ్ గత ఏడాది ఓ సినిమాలో రణ్ బీర్ కపూర్ తో సన్నిహిత సన్నివేశాల్లో నటించడంపై అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. ఐశ్వర్య మాత్రం ఆ విమర్శలేమీ పట్టించుకోకుండా కెరీర్ కొనసాగిస్తోంది. తాజాగా బాలీవుడ్ కు సైజ్ జీరో పరిచయం చేసిన హీరోయిన్ కరీనాకపూర్ పైనా ఇలాంటి విమర్శలే వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్యకాలంలో కరీనా ఎక్కడికి వెళ్లినా అసభ్యకర రీతిలో దుస్తులు వేసుకుంటోందని, ఆమె నటించిన వీరే ది వెడ్డింగ్ చిత్రంలోనూ ఆమె డ్రెస్ లు ఏ మాత్రం హుందాగా లేవని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
అయితే కరీనా ఈ విమర్శలు వినీవిననట్టేం ఊరుకోవడం లేదు. తనను విమర్శిస్తున్నవారికి తనదైన స్టయిల్ లో సమాధానమిస్తోంది. ఎలాంటి దుస్తులు వేసుకుంటే నప్పుతాయో అలాంటివే వేసుకుంటామని, అమ్మ వేసుకునే దుస్తులు అన్న పదాలేంటో తనకు అర్ధం కావడం లేదని ఆమె వ్యాఖ్యానించింది. తన తల్లి ఇప్పటికీ మోడ్రన్ దుస్తులు వేసుకుంటుందని, ఆమె జీన్స్, టాప్ వేసుకుంటే మరింత అందంగా కన్పిస్తుందని, తన అత్త షర్మిళ ఠాగూర్ కూడా ఇప్పటికీ జీన్స్ వేసుకుంటుందని, చీర కట్టుకుంటే ఆమె ఎంత అందంగా ఉంటుందో, జీన్స్ వేసుకున్నా అంతే ఆకర్షణీయంగా కన్పిస్తుందని కరీనా చెప్పుకొచ్చింది. మహిళలెవరైనా ఫలానా దుస్తులు నప్పుతాయి అనిపిస్తే వాటిని ధైర్యంగా ధరించాలని సూచించింది.
తాను గర్బిణిగా ఉన్నప్పుడు కూడా తనపై ఎన్నో విమర్శలు వచ్చాయని, సమాజం మహిళకు నచ్చినట్టుగా ఉండే స్వేచ్ఛనివ్వాలని ఆమె కోరింది. ఒకప్పుడు హీరోయిన్లు ఎంత వయసు వచ్చినా 25 ఏళ్లలాగే కన్పించాలని కోరుకునేవారని, కానీ, ఇప్పుడు తమపై అలాంటి ఒత్తిళ్లు లేవని, విద్యాబాలన్, ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్, అలియా భట్… వీరంతా అలాంటి అభిప్రాయాలను మారుస్తున్నారని ఆమె అభిప్రాయపడింది. బాలీవుడ్ లోనే కాదు… టాలీవుడ్, కోలీవుడ్ లోనూ హీరోయిన్లు ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. గతంలో కస్తూరి, అన్నమయ్య, సోగ్గాడి పెళ్లాం, మా ఆయన బంగారం వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కస్తూరి కొంతకాలం నుంచి సహాయపాత్రలు పోషిస్తోంది.
2010లో తమిళ పదం అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన కస్తూరి ఎనిమిదేళ్ల తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న తమిళపదం 2.0 లోనూ నటించింది. ఈ చిత్రంలో కస్తూరి ఐటెంసాంగ్ లో కనిపించడంపై కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. బాధ్యత గల అమ్మగా ఉండాల్సిన ఓ స్త్రీ ఇలా ఐటెమ్ సాంగ్ లో నర్తించడం ఎంత వరకు సబబు అని ట్విట్టర్ లో ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కస్తూరి ఐటెమ్ సాంగ్ అనేది చూసే కళ్లను బట్టి ఉంటుంది, పెళ్లయి, పిల్లలున్న మగవాళ్లు కూడా కొన్ని సినిమాల్లో మద్యం సేవించే సన్నివేశాల్లో, ఐటెం సాంగ్స్ లో నటిస్తున్నారు కదా… మరి వారికి పిల్లలు పట్ల బాధ్యత లేదా? మమ్మల్ని ప్రశ్నించిన విధంగా వాళ్లనెందుకు ప్రశ్నించరు? అమ్మనైనంత మాత్రాన ఐటెం సాంగ్ లో నర్తించకూడదనే నియమం లేదుకదా… స్త్రీ, పురుష సమానత్వం అనే అంశం ఇప్పుడిప్పుడే బయట ప్రపంచానికి తెలుస్తోంది. దాన్ని అమలు పరచనివ్వండి. ఇలాంటి ప్రశ్నలు వేసి సమానత్వాన్ని పాతాళానికి తొక్కేయకండి అని నెటిజన్ కు దీటుగా సమాధానమిచ్చింది.
కస్తూరే కాదు… రంగస్థలం విడుదలయిన తర్వాత టాలీవుడ్ హీరోయిన్ సమంత కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేసింది. నాగచైతన్యతో పెళ్లి తర్వాత రంగస్థలంలో చరణ్ తో లిప్ లాక్ లో నటించడపై సమంతను పెళ్లయిన తర్వాత ముద్దు సన్నివేశంలో ఎలా నటించారని ప్రశ్నించగా… చరణ్ కు కూడా పెళ్లయిందిగా… తనను ఈ ప్రశ్న ఎందుకడగగరని మీడియాకు ఎదురుప్రశ్న వేసింది. మొత్తానికి హీరోయిన్లంతా పెళ్లి, పిల్లల తర్వాత కెరీర్ కొనసాగించడాన్నే కాదు… అసభ్యకరరీతిలో డ్రెస్ లు వేసుకోవడం, లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడాన్ని కూడా స్వేచ్ఛ, సమానత్వంగా భావిస్తున్నారన్నమాట.