నాకు తెలిసి ఇండస్ట్రీలో ఏమి మాట్లాడితే ఏమవుతుందో అని భయపడకుండా మాట్లాడే దర్శకుల్లో వర్మది మొదటి స్థానం, ఎందుకంటే అతనికి భయం ఉండదు ఎవరి గురించి అయినా తప్పుగా మాట్లాడితే ఆ హీరో మళ్ళీ అవకాశం ఇస్తాడో ఇవ్వడో అని. అదొక రకం ముక్కుసూటి మనస్తత్వం, నిజానికి వర్మ ఆలోచనలు దాదాపు 80 శాతం మందికి ఉంటాయి కానీ అవి బయటపడే వారే తక్కువ. అలా బయటపడిన వర్మని ఒక స్పెషల్ కేటగిరీ కింద వదిలేశారు. మరి వర్మ దగ్గర పనిచేయడం వలనో లేక స్వతహాగా కూడా అంతేనో కానీ Rx డైరెక్టర్ అజయ్ భూపతికి కూడా గుండె ధైర్యం టన్నులు టన్నులు ఉన్నట్టు అనిపిస్తోంది. తీసింది మొదటి సినిమా అయినా సినిమా ఆడితే రెండో సినిమా చేస్తా లేకపోతే ఊరెళ్ళి పోయి మాకున్న వ్యవసాయం చేసుకుంటూ గేదెలు కాసుకుంటా అని చెప్పే దమ్ము ఎవరికీ ఉండదు(అదే స్థానంలో నేనే ఉన్నా సినిమా మీద నాకున్న పిచ్చి అది అనలేకపోవచ్చు) కానీ ఇప్పుడు హీరోల మేనేజర్ల గురించి మాట్లాడి వర్మ శిష్యుడిని అని నిరూపించేసుకున్నాడు అజయ్. నిజానికి సినిమా విడుదలకి ముందే అజయ్ భూపతి ఘాటైన స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఆ మాటలు విన్నవాళ్ళు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడని, కుర్రాడికి బలుపు అనీ వర్మ శిష్యుడు కాబట్టి ఇంకా చెప్పేదేముంది అన్నీ ఒక గూటి పక్షులే అన్నట్టు మాట్లాడారు.
నేను విన్న నన్ను బాధ పెట్టిన కామెంట్ ఏమిటంటే? అజయ్ భూపతి రొటీన్ సినిమాలు చూడొద్దు అంటే అసలు థియేటర్లో జనాలే ఉండరు అని, సరిగ్గా అది విన్న మూడో రోజునే సినిమా రంగంలోకి దిగింది. అజయ్ భూపతికి బలుపురా అన్న వాళ్ళే..కుర్రోడి దగ్గర విషయం ఉందిరా అనుకున్నారు(విషయం లేకపోతే అసలు వర్మ దగ్గర ఎలా పనిచేస్తాడు అనేది నా అభిప్రాయం). సినిమా విడుదలైన పదో రోజున కూడా హౌస్ ఫుల్ షోలతో నడుస్తుంటే అర్ధమవుతుంది ఆ కామెంట్స్ చేసినోళ్ళకి అజయ్ భూపతిది బలుపు కాదు, కాన్ఫిడెన్స్ రా భాయ్ అని, అది తన మీద అతి ముఖ్యంగా తన టీం మీద ఉన్న నమ్మకం. సినిమా క్లైమాక్స్ లో అజయ్ చేసిన మ్యాజిక్ ని మెచ్చుకోక తప్పదు. సాధారణంగా అయితే బాహుబలిలో తమన్నని ప్రభాస్ వాటేసుకుంటేనే అదొక రేప్ అన్నట్టు మాట్లాడిన మహిళలు మహిళా సంఘాలు సైతం నిజమేగా ఇలాంటి అమ్మాయిలు ఉన్నారుగా అని ఆలోచించేలా చేయడంలోనే అజయ్ భూపతి టాలెంట్ ఎలివేట్ అయ్యింది. ఇంకో విషయం సినిమా సక్సెస్ అయ్యాక ఈ సినిమాకి ఈ దర్శకుడు కాపోతే సినిమా పోయేది అనే హీరో హీరోయిన్లు ఉన్నారు. మా హీరో బాబు కాక ఇంకెవరు చేసినా సినిమా పోయేది అనే దర్శక నిర్మాతలు ఉన్నారు. అంటే ఒక రకమైన భజన అది. కానీ అజయ్ మాత్రం తన సినిమా మొదలు పెట్టినప్పటి నుండి తనతోనే ఉన్న తనతోనే పనిచేసిన టెక్నీషియన్స్ అందరినీ కలిపి సిటీలో బ్యానర్లు వేయించాడు. ఇది కదా ఒక సినిమాకి పనిచెసీన వారికి దక్కే అరుదైన గౌరవం.
అలాగే నాకు తెలిసి చాలా వరకు హీరోలు కధలు స్వయంగా వినరు, ఇది నా ఫ్రెండ్స్ సర్కిల్ లో డైరెక్టర్స్ గా ట్రయల్స్ వేస్తున్న వారి ద్వారా నాకు బయట తెలిసిన వారి ద్వారా విన్న అనుభవం. ఇది ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు కానీ ఏ ఒక్కరు మాట్లాడారు ఎందుకంటే నెక్స్ట్ టైం కదా చెప్పడానికి వెళ్తే ఆ మేనేజర్లు ఏమన్నా అంటారేమో ? హీరో గారి దగ్గరకి కధ తీసుకేల్లరేమో అనే భయం. ఒక రకంగా ఆ మేనేజర్ల లేదా పీయేల మూడ్ ని బట్టి కధని డిసైడ్ చేస్తారంటే ఎవరూ నమ్మరు. కానీ ఇండస్ట్రీలో జరుగుతున్న రియాలిటీ ఇది. కానీ అజయ్ అలా భయపడలేదు హీరోలు ఖాళీగా ఉంటే వినాలి. లేదంటే మానేయాలి. అలా కాకుండా… మేనేజర్లను, పీఏలను పంపకూడదు. ఎందుకంటే… హీరోల మైండ్సెట్ వేరు. వాళ్ల మేనేజర్లకు ఉండే మైండ్సెట్ వేరు. కథ వినడం ఒక ఆర్ట్. మేనేజర్ కథ వింటే… అతనికి ఏం అర్థమవుతుంది? హీరో దగ్గకు వెళ్లి ఏం చెబుతాడు? ఎవరినో కథ వినమని పంపడం తప్పు. పీఏలు, మేనేజర్లు కథలు విని తమకు నచ్చినవి హీరోలకు చెబుతారు. అప్పుడు హీరోలు తమకు నచ్చినవి కాకుండా… మేనేజర్ల మైండ్సెట్కి నచ్చిన సినిమాలు చేయాల్సి వస్తుంది. దీని వల్ల కొన్ని మంచి కథలు హీరోల వరకూ వెళ్లకుండా పోతున్నాయి. దాంతో వాళ్లకు నష్టమే జరుగుతోంది. ఇది హీరోలు అందరూ ఆలోచించుకోవాల్సిన విషయం అని ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు.
అంతటితో ఆగాడా అంటే లేదు సినిమా జరుగుతుండగానే మరో పక్క ట్యాబ్ లలో రివ్యూలు రాసే రివ్యూ రైటర్లనూ వదలలేదు. నిన్న వైజాగ్ సక్సెస్ మీట్ లో మొదటి మూడు రోజులు రివ్యూలు నిషేధించాలి అని మరో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ మాట పాతదే చాలా సార్లు చాలా మంది డైరెక్టర్ లు బాధ పడిన సందర్భాలు ఉన్నాయి. పాపం ఒకే రోజు రెండు సినిమాలు విడుదలకి ఉంటె ఎక్కడ రివ్యూ రాసేవాళ్ళు, మీడియా వాళ్ళు మిస్ అవుతారో అని ముందు రోజే స్పెషల్ షోలు వేసి మరీ చూపిస్తే వాళ్ళు మాత్రం చక్కా తమకు నచ్చిన విధంగా రాసేస్తున్నారు. కొంచెం బాగున్న సినిమాలకి అసలు పాజిటివ్ రివ్యూలే రావడం లేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఒక సినీ విశ్లేషకుడిగా కొన్ని టేక్నికాలిటీస్ మిస్ అయినా సినిమా సోల్ పరంగా చూసుకుని బాగుందని రాస్తాం…ఎందుకో తెలీదు మరి వారు ఈ ఫీల్డ్ లో సీనియర్లు అయ్యుండచ్చు కానీ ఎన్నో నెలల కష్టాన్ని ఒక్క రివ్యూతో ఉఫ్ అని ఊదేస్తారు. అజయ్ అన్నట్టు మూడు రోజుల వరకూ రివ్యూలు ఆగినా నిర్మాతలు గట్టెక్కే అవకాశం ఉంది. కానీ చాలా కష్టం రివ్యూలను ఆపడం అనేది. ఇంతకు ముందు కూడా చాలా ప్రయత్నాలు జరిగాయి బట్ అది కుదరని పని. కానీ అజయ్ భూపతి చేసే ప్రతి ఒక్క స్టేట్మెంట్ రియల్ లైఫ్ Rx 100 అజయ్ భూపతే అనేలా చేస్తున్నాయి.
భార్గవ్ చాగంటి – Bhargav chaganti