Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆధ్యాత్మికత ముసుగు తొలగుతోంది. అత్యాచార కేసుల్లో బాబాలు వరుసగా దోషులుగా తేలుతున్నారు. అందరికీ సన్మార్గం బోధించాల్సిన హోదాలో ఉన్న గురువులు దారి తప్పి అమ్మాయిలపై అత్యాచారాలకు ఒడిగట్టి… జైలు ఊచలు లెక్కపెడుతున్నారు. మొన్న డేరాబాబా… ఇప్పుడు ఆశారాంబాపు. ఈ కేసులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. బాబాల అసలు స్వరూపం తెలియడంతో పాటు… వారికి వ్యతిరేకంగా వస్తున్న తీర్పుల వల్ల సాధారణ ప్రజలకు న్యాయస్థానాలపై నమ్మకం పెరుగుతోంది. అయితే అసలు తీర్పుదాకా కేసు రావాలంటే… ముందుగా వారిని అరెస్ట్ చేయాలి. అన్ని ఒత్తిళ్లనూ తట్టుకుని దర్యాప్తు కొనసాగించాలి. అనేకరాష్ట్రాల్లో విస్తృతమైన నెట్ వర్క్ ఉండే ఇలాంటి బాబాల విషయంలో అరెస్ట్ లూ, దర్యాప్తులూ అంత తేలిక కాదు… ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించడమే. ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు ఆశారాంబాపూను అరెస్ట్ చేసిన జోధ్ పూర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అజయ్ పాల్ లంబా.
ఆశారాం బాపూకు జోధ్ పూర్ సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించిన నేపథ్యంలో ఆశారాం అరెస్ట్ నాటి పరిస్థితులను ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు. మధ్యప్రదేశ్ లోని చింద్వారాలో గల ఆశారాం ఆశ్రమంలో చదువుకుంటున్న 16 ఏళ్ల బాలికపై ఆగస్టు 15,2013న ఆశారాం అత్యాచారం చేసినట్టు కేసు నమోదయింది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆశారాంతో పాటు మరో ముగ్గురిపై ఎఫ్ ఐఆర్ నమోదుచేశారు. ఎఫ్ ఐఆర్ అయితే నమోదయింది కానీ… ఐదురాష్ట్రాల్లో అనుచరులు, బలమైన మద్దతుదారులు ఉన్న ఆశారాం ను అరెస్ట్ చేయడం అంత ఈజీగా జరగలేదంటున్నారు లంబా… మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఉన్న ఆశారాం ఆశ్రమానికి 11 మంది సభ్యులతో కూడిన బృందంతో సమన్లు ఇవ్వడానికి వెళ్లినప్పుడు దాదాపు 8వేలమంది ఆశారాం అనుచరులు తమపైకి వచ్చారని, నోటీసుకాగితం ఆశారాంకు ఇవ్వడానికి పోలీసులకు పదిగంటల సమయం పట్టిందని చెప్పారు. మైనర్ బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలంతోనే ఆశారాంను అరెస్ట చేయగలిగామని, ఈ కేసులో అదే కీలకసాక్ష్యమని తెలిపారు.
అరెస్ట్ తర్వాత తనకు దాదాపు 2వేల బెదిరింపు ఉత్తరాలు వచ్చాయని, వందలకొద్దీ బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చేవని లంబా తెలిపారు. ఆశారాంకు ఏదైనా జరిగితే తన కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించేవారని, తన ఫోన్ ఎప్పుడూ రింగవుతూనే ఉండేదని, ఆ సమయంలో తెలియని వ్యక్తులనుంచి ఫోన్ వస్తే తీయడమే మానేశానని చెప్పారు. కేసు విచారణ జరుపుతున్న సమయంలో తన కూతురుని స్కూల్ కు కూడా పంపలేదని, తన భార్యను ఇంట్లో నుంచి అడుగుకూడా బయటకు పెట్టనిచ్చేవాడిని కాదని వెల్లడించారు. కేసుకు సంబంధించి ముగ్గురు సాక్ష్యులు ఒక్కొక్కరుగా చనిపోవడం తమను ఎంతగానో బాధించిందన్నారు. కేసుపై మీడియా దృష్టి ఎక్కువగా ఉండేదని, ఆశారాం అనుచరుల నుంచి పోలీసులకు తరచూ బెదిరింపులు వస్తుండేవని గుర్తుచేసుకున్నారు. లంబా ప్రస్తుతం జోధ్ పూర్ అవినీతి వ్యతిరేక విభాగం ఎస్పీగా పనిచేస్తున్నారు. జోధ్ పూర్ సెషన్స్ కోర్టు తీర్పుపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. ఈ తీర్పు చరిత్రాత్మకమని, న్యాయం గెలిచిందని వ్యాఖ్యానించారు.