Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూకు జోధ్ పూర్ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరు దోషులకు 20 ఏళ్ల చొప్పున జైలుశిక్ష విధించింది. జోధ్ పూర్ సెంట్రల్ జైలులో ఏర్పాటుచేసిన ప్రత్యేక గదిలో సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ మధుసూదన్ శర్మ ఈ తీర్పు వెల్లడించారు. ఆశారాంకు కనీస శిక్ష విధించాలని ఆయన తరపు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ న్యాయమూర్తి… జీవిత ఖైదు విధించారు. ఈ తీర్పుపై తాము హైకోర్టును ఆశ్రయిస్తామని ఆశారాం అధికార ప్రతినిధి తెలిపారు. తీర్పు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఐదురాష్ట్రాల్లో బలమైన నెట్ వర్క్ ఉన్న ఆశారాంకు శిక్ష పడ్డ తర్వాత విధ్వంసం జరగొచ్చన్న ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. జోధ్ పూర్ జైలు సహా రాజస్థాన్, గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లో భద్రత కట్టుదిట్టంచేశారు. ఈ నెల 30 వరకూ పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.
ఉత్తర్ ప్రదేశ్ లోని షాహజాన్ పూర్ కు చెందిన అత్యాచార బాధితురాలి ఇంటివద్ద ఏడుగురు పోలీసులతో రక్షణ కల్పించారు. అసలు ఈ కేసు వివరాల్లోకి వెళ్తే… మధ్యప్రదేశ్ లోని చింద్వారాలో గల ఆశారం ఆశ్రమంలో చదువుకుంటున్న బాలికపై ఆశారాం 2013 ఆగస్టు 15న అత్యాచారం చేసినట్టు కేసు నమోదయింది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆశారాంతో పాటు మరో ముగ్గురిపై ఎఫ్ ఐఆర్ నమోదుచేశారు. 2013 సెప్టెంబర్ 1న మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో తన ఆశ్రమంలో ఉన్న ఆశారాంను అజయ్ పాల్ లంబా నేతృత్వంలో జోధ్ పూర్ పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో ఇది దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. అరెస్టయిన దగ్గరనుంచి ఆశారాం జోధ్ పూర్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో ఏప్రిల్ 7న వాదనలు పూర్తవగా… ఇవాళ తీర్పు వెల్లడించారు. తీర్పు సందర్భంగా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఆశారాంను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆశారాం బాలికను రేప్ చేశారనడానికి సాక్ష్యాలున్నాయని చెప్పిన న్యాయమూర్తి, సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితిని ఆయన కల్పించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలకు మంచి చెప్పి, వారిని సన్మార్గంలో నడిపించాల్సిన స్థానంలో ఉన్న వ్యక్తి, తనను దేవుడిగా నమ్మి వచ్చిన అమ్మాయిపై దారుణానికి ఒడిగట్టారని వ్యాఖ్యానించారు.