ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. పలువురు నేతలు ఇప్పటికే పార్టీలు మారడంతో అధికార ప్రతిక్షాల మధ్య పోరు హోరాహారీగా జరగనుందని రాజకీయవర్గాలు విశ్లేషణ చేస్తున్నాయి. సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సోదరుడి భార్య అపర్ణ యాదవ్ బుధవారం బీజేపీలో చేరారు.
అపర్ణ యాదవ్ బీజేపీలో చేరడంపై అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. అపర్ణ యాదవ్ సమాజ్వాదీ పార్టీ భావాజాలన్ని బీజేపీలో వ్యాప్తి చేయనుందని తెలిపారు. తమ పార్టీ టికెట్లు ఇవ్వలేనివారికి బీజేపీ ఇవ్వడం సంతోషమని ఎద్దేవా చేశారు. సమాజ్వాదీ పార్టీ భావాజాలన్ని అపర్ణ యాదవ్ ఇతరపార్టీలో కూడా వ్యాప్తి చేయాలనుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. తప్పకుండా సమాజ్వాదీ పార్టీ భావాజాలం బీజేపీకి చేరుతుందని తెలిపారు.
ఆమె పార్టీ మారకుండా ఉండాలని ప్రయత్నించామని, కానీ సాధ్యం కాలేదని పేర్కొన్నారు.కాగా, అపర్ణ యాదవ్ 2017లో ఎస్పీ తరపున పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో అపర్ణ యాదవ్.. బీజేపీ నేత రీటా బహుగుణ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఇక మరోవైపు అపర్ణయాదవ్ చేరిక బీజేపీ ఏమేరకు కలిసివస్తుందో చూడాలి.