Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పదేళ్ల క్రితం రావల్పిండిలో దారుణ హత్యకు గురయిన పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో ను ఎవరు చంపారన్నది ఇప్పటికీ నిర్దారణ కాలేదు. ఈ హత్య వెనక అప్పటి పాక్ అధ్యక్షుడు ముషారఫ్ ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వచ్చినా… తర్వాతి కాలంలో దాని గురించి చర్చ జరగలేదు. తాజాగా నిన్నటితో బెనజీర్ భుట్టో హత్య జరిగి పదేళ్లయిన సందర్భంగా పాక్ మీడియా ఓ కథనాన్ని ప్రసారం చేసింది. అప్పటి ఆల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ఆదేశంమేరకే బెనజీర్ భుట్టో హత్య జరిగిందని పాక్ నిఘా వర్గాలు వెల్లడించాయన్నది ఆ కథనం సారాంశం. అయితే ఈ హత్య గురించి పాక్ హోంశాఖను నిఘావర్గాలు ముందే హెచ్చరించాయని తెలుస్తోంది.
బెనజీర్ భుట్టో,ముషారఫ్, జమైత్ ఉలెమా-ఇ-ఇస్లాం ఫజల్ చీఫ్ ఫజ్లర్ రెహ్మాన్ ను చంపేయాలని లాడెన్ తన అనుచురులను ఆదేశించినట్టు నిఘావర్గాలు పాక్ హోంశాఖకు లేఖ రాశాయి. ఈ హత్యా పథకాలను లాడెన్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడని, అందుకోసం అతను ఆఫ్ఘన్ కూడా వెళ్లాడని, భద్రతను కట్టుదిట్టం చేయాలని నిఘావార్గాలు ఈ లేఖలో సూచించాయి. కానీ అప్పటి ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకపోవడంతో ఉగ్రవాదులు అనుకున్నట్టుగా తమ లక్ష్యం నెరవేర్చుకున్నారు.
బాంబుదాడితో భుట్టోను హతమార్చారు. దాడికి ఉపయోగించిన పేలుడు పదార్టాలు లాడెన్ పేరుతో కొరియర్ లే వచ్చినవేఅని, అలాగే దాడి జరిగిన రెండు రోజుల తర్వాత భుట్టో మరణించినట్టు లాడెన్ కు ఉగ్రవాదులు లేఖ కూడా రాశారని పాక్ నిఘావర్గాలు ఇప్పుడు చెబుతున్నాయి. పాకిస్థాన్ లో తలదాచుకున్న లాడెన్ ను 2011లో అమెరికా దళాలు దాడిచేసి హతమార్చిన సందర్భంలో భుట్టో హత్యను తెలియజేసే లేఖను స్వాధీనం చేసుకున్నాయి.