ఏపీలో ఎన్నికల ముందు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంచలనం రేపింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఇప్పటికే వివేకా భార్య సౌభాగ్యమ్మ, టీడీపీ నేత బీటెక్ రవి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి కోర్ట్‌లో పిటీషన్లు కూడా వేశారు. అయితే గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ కూడా ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదని, అప్పటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జగన్ సీబీఐ విచారణ కోరారని, అయితే ప్రస్తుతం సిట్ విచారణ సక్రమంగా జరుగుతుందని ప్రభుత్వ తరపు ఏజీ ఇదివరకే కోర్ట్‌కు విన్నవించారు. అయితే తాజాగా ఈ కేసును సీబీఐకీ అప్పగించాలని వివేకానందరెడ్డి కూతురు సునీత కోర్ట్‌లో పిటీషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసులో కొందరిపై అనుమానాలున్నాయని పిటీషన్లో పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఆరోపణలు కాదని కేవలం అనుమానాలేనని కొందరి జాబితాను ఆమె హైకోర్ట్‌కు సమర్పించారు. అయితే ఆ జాబితాలో వైసీపీ ఎంపీ అవినాష్, టీడీపీ మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నేత ఆది నారాయణరెడ్డితో పాటు మరికొందరి పేర్లు కూడా ఉన్నాయి. అయితే దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, ప్రభుత్వ తరపు ఏజీ అందుబాటులో లేకపోవడంతో కోర్ట్ ఈ కేసు విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది.