కాపీరైట్‌ దెబ్బకి బన్నీ రికార్డ్‌ మాయం

అల్లు అర్జున్‌, బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో వచ్చిన ‘సరైనోడు’ చిత్రాన్ని హిందీలో శాటిలైట్‌ రైట్స్‌ కోసం ‘దిల్‌వాలా’గా డబ్‌ చేసిన విషయం తెల్సిందే. సినిమా టీవీలో ప్రసారం అయిన తర్వాత యూట్యూబ్‌లో పోస్ట్‌ చేశారు. ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో పోస్ట్‌ చేసిన కొన్ని రోజుల్లోనే 10 మిలియన్‌ వ్యూస్‌ను దక్కించుకుంది. ఆ తర్వాత ఈ చిత్రం యూట్యూబ్‌లో రికార్డుల మీద రికార్డులు దక్కించుకుంటూ కేవలం సంవత్సరంలోనే ఏకంగా 200 మిలియన్‌ వ్యూస్‌ను దక్కించుకుంది. ఇప్పటి వరకు ఏ ఇండియన్‌ సినిమా ఇంతటి వ్యూస్‌ను దక్కించుకోలేక పోయింది. అందుకే మెగా స్టైలిష్‌ స్టార్‌ను ఇండియన్‌ యూట్యూబ్‌ సూపర్‌ స్టార్‌ అంటూ మెగా ఫ్యాన్స్‌ పిలుచుకున్నారు. 200 మిలియన్‌ వ్యూస్‌ దక్కిన కొన్ని రోజుల్లోనే ఈ చిత్రాన్ని యూట్యూస్‌ వారు కాపీ రైట్‌ పేరుతో తొలగించారు.

గతంలో కూడా ఇలాంటి సంఘటనలు యూట్యూబ్‌లో జరిగాయి. కాని ఇంతటి రికార్డు వచ్చిన మూవీని తొలగించడంతో యూట్యూబ్‌పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సంవత్సరం తర్వాత ఎందుకు యూట్యూబ్‌ వారు సినిమాను తొలగించాల్సి వచ్చిందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇంత భారీ రికార్డును సాధించిందనే సంతోషం లేకుండా మెగా ఫ్యాన్స్‌కు నిరాశ మిగిలింది. కాపీ రైట్‌ కారణంగా తొలగించబడిన సినిమాను మళ్లీ పోస్ట్‌ చేశారు. ఈసారి కూడా కేవలం రెండు రోజుల్లోనే 1.5 మిలియన్‌ వ్యూస్‌ను ఈ చిత్రం దక్కించుకుంది. ప్రతి రోజు కూడా భారీ ఎత్తున ఈ వీడియోను హిందీ ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు. మళ్లీ కూడా ఈ చిత్రం 100 మిలియన్‌ వ్యూస్‌ను దక్కించుకుంటుందనే నమ్మకంతో హిందీ నిర్మాతలు ఉన్నారు. అద్బుతమైన రికార్డును బన్నీ చేజార్చుకోవడంతో మెగా ఫ్యాన్స్‌ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.