అర్జున్‌ రెడ్డి నచ్చింది కాని ఇది నచ్చలేదట!

మంచు లక్ష్మి ప్రవర్తన కొన్ని సార్లు విచిత్రంగా అనిపిస్తుంది. కొన్ని సార్లు చాలా హుందాగా, పెద్దతరహా అమ్మాయిగా, పెద్దింటి అమ్మాయిగా కనిపించే మంచు లక్ష్మి కొన్ని సార్లు మాత్రం అల్లరి పిల్లగా, ఆకతాయి అమ్మాయిగా అనిపిస్తూ ఉంటుంది. తన సినిమాల్లో మాదిరిగానే నిజ జీవితంలో కూడా అల్లరి అల్లరిగా మంచు లక్ష్మి ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇటీవల సోషల్‌ మీడియాలో తన కుటుంబంపై తనపై ట్రోల్స్‌ చేస్తున్న వారిపై విరుచుకు పడిన మంచు లక్ష్మి తాజాగా తన సినిమాకు పోటీగా వచ్చిన ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంపై విమర్శలు గుప్పించింది. అందరు సూపర్‌ హిట్‌ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్న ఆ చిత్రంపై మంచు లక్ష్మి మాత్రం విమర్శలు చేస్తోంది. ఆర్‌ఎక్స్‌ 100 చిత్రంలో ఆడవారిని తప్పుగా చూపించడంతో పాటు, వారిని నెగటివ్‌ మైండ్‌ సెట్‌ ఉంటుందని చూపించే ప్రయత్నం చేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

సినిమాలో రొమాన్స్‌ ఉండాలే తప్ప అది హద్దులు దాట కూడదు అని, సినిమాలో రొమాంటిక్‌ సీన్స్‌ సందర్బానుసారంగానే ఉండాలి తప్ప వల్గర్‌గా ఉండకూడదు అంటూ చెప్పుకొచ్చింది. వైఫ్‌ ఆఫ్‌ రామ్‌ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ.. బోల్డ్‌ సినిమాకు, వల్గర్‌ సినిమాలకు తేడా ఉంటుందని, తాజాగా విడుదలైన కొత్త సినిమా వల్గర్‌గా ఉంది అంటూ చెప్పుకొచ్చింది. అయితే గతంలో వచ్చిన అర్జున్‌ రెడ్డి చిత్రం మాత్రం బోల్డ్‌ చిత్రం అని, అందులో ఆడవారిని తప్పుగా చూపించక పోవడంతో పాటు, హీరోయిన్‌ పాత్రను హుందాగా చూపించారు అంటూ చెప్పుకొచ్చింది. ఆర్‌ఎక్స్‌ 100 చిత్రం పేరు ఎత్తకుండానే ఈ చిత్రంలో మాత్రం వల్గర్‌ ఎక్కువగా ఉండటంతో పాటు, హీరోయిన్‌ పాత్రను దారుణంగా చూపించారు అంటూ చెప్పుకొచ్చింది. ప్రేక్షకులు అర్జున్‌ రెడ్డి మరియు ఆర్‌ఎక్స్‌ 100 చిత్రాలు ఒకటే అంటున్నారు. మరి ఎందుకు మంచు లక్ష్మికి మాత్రం వేరు వేరు అనిపిస్తున్నాయో ఆమెకే తెలియాలి.