త్రివిక్రమ్ దర్శకత్వం లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ ఘోర పరాజయం పాలవడంతో తన మీద నమ్మకం తగ్గింది. దాంతో ‘అరవింద సమేత’ చిత్రానికి చాలా జాగ్రత్త పడ్డాడు. కథ, కథనాల పరంగానే కాకుండా బడ్జెట్ పరంగా కూడా త్రివిక్రమ్ కేర్ తీసుకున్నాడు. మామూలుగా బిజినెస్ ఎంత అవుతుందంటే అందుకు సమానంగా ఖర్చు చేయించేస్తుంటాడు త్రివిక్రమ్. అలాంటిది ‘అరవింద సమేత’కి మాత్రం ఖర్చు పరంగా కూడా రాజీ పడ్డాడు.
ఆ సినిమాకి అసలు ఫారిన్ షెడ్యూలే లేకపోవడం గమనార్హం. అయితే ఇప్పుడు ‘అల వైకుంఠపురములో’కి మాత్రం ఖర్చు తారాస్థాయిలో జరుగుతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో భారీ తారాగణం వున్నారు. అలాగే దీని కోసం పలు సెట్స్ కూడా వేసారు. అదీ కాక పారిస్ వెళ్లి ఇంతవరకు ఎవరూ తీయని లొకేషన్లలో షూటింగ్ చేసుకుని వచ్చారు.
ఈ చిత్రానికి ఖర్చు తడిసి మోపెడవుతోందని, అల్లు అర్జున్ చిత్రాల్లోనే అతి ఖరీదైన చిత్రంగా తెరకెక్కుతోందని చెబుతున్నారు. ఈ చిత్రానికి బిజినెస్ ఎంత బాగా జరిగినా కానీ నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా కలుపుకుంటే తప్ప నిర్మాతలు బ్రేక్ ఈవెన్ అవలేరట. ఈ చిత్రానికి అల్లు అరవింద్ కూడా ఒక నిర్మాత అయినప్పటికీ త్రివిక్రమ్ ఇంతగా ఖర్చు పెట్టేయడం గురించి ఇండస్ట్రీలో కథలు, కథలుగా చెప్పుకుంటున్నారు.