సింగర్ భవ్నిందర్ సింగ్‌తో అమలాపాల్ వివాహం

సింగర్ భవ్నిందర్ సింగ్‌తో అమలాపాల్ వివాహం

ముంబైకి చెందిన సింగర్ భవ్నిందర్ సింగ్‌తో అమలాపాల్ సహజీవనం చేస్తున్నట్టు ఇండస్ట్రీ ఇన్‌సైడర్స్ ద్వారా బయటికి వచ్చింది. అయితే, అమలాపాల్ నిర్మాతగా మారి నిర్మించిన తొలి సినిమా ‘కడవేర్’కు భవ్నిందర్ సింగ్ సహ నిర్మాతగా వ్యవహరించడం.. వీరిద్దరి రిలేషన్‌షిప్‌ వార్తలకు బలం చేకూర్చినట్టయింది. అలాగే, వీరిద్దరూ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు వీరి రిలేషన్‌షిప్‌ను స్పష్టం చేశాయి. ఇదిలా ఉంటే, శుక్రవారం మార్చి 20న అమలాపాల్ పెళ్లి ఫొటోలు బయటికి వచ్చాయి. భవ్నిందర్ సింగ్‌ను ఆమె పెళ్లాడినట్టు ఫొటోలు స్పష్టం చేశాయి. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

అమలాపాల్ రెండో వివాహం చేసుకున్నారని.. ముంబై సింగర్ భవ్నిందర్ సింగ్‌ను ఆమె పెళ్లాడారని ప్రస్తుతం అందరికీ తెలిసిన విషయం. కానీ, ఈ పెళ్లి వెనుక ఉన్న మిస్టరీ, అసలు నిజాలను ‘చెన్నై టైమ్స్’ బయటపెట్టింది. ఈ పెళ్లిపై క్లారిటీ కోసం అమలాపాల్‌ను కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేసింది. అయితే, అమలాపాల్ పెళ్లి విషయం గురించి తమకే తెలీదని ఆమె వ్యవహారాలు చూసుకునే వ్యక్తులు వెల్లడించారు. అమలాపాల్, భవ్నిందర్ సింగ్ ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా కలుసుకున్నారని, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని మరో వ్యక్తి తెలిపారు. ఇద్దరూ కొన్నాళ్లపాటు డేటింగ్ చేశారని.. కానీ, ప్రస్తుతం వాళ్లు విడిపోయారని ఆశ్చర్యకర నిజాన్ని బయటపెట్టారు. భవ్నిందర్ సింగ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అమలాపాల్ అన్‌ఫాలో కావడం కూడా దీనికి ఊతమిస్తోంది. మరి, దీనిపై అమలా స్పందిస్తారో లేదో చూడాలి.

అటు సినిమాలతో పాటు ఇటు వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తున్నారు అమలాపాల్. ఆమె ప్రస్తుతం మహేష్ భట్ నిర్మిస్తోన్న వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. 70ల్లో జరిగిన కెరీర్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటోన్న ఒక దర్శకుడు, స్టార్ హీరోయిన్‌ల మధ్య ప్రేమకథ ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను తీస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ ప్రాజెక్ట్‌లో తాహిర్ రాజ్ భాసిన్, అమృత పూరి కూడా నటిస్తున్నారు. మహేష్ భట్ నిర్మిస్తోన్న తొలి వెబ్ సిరీస్ ఇది. జియో స్టూడియోస్‌తో కలిసి దీన్ని నిర్మిస్తున్నారు. డిజిటల్ వరల్డ్‌లో ఇది తనకు సరికొత్త ప్రయాణమని, దీని ద్వారా ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని ఇవ్వబోతున్నానని ఇటీవల మీడియాతో మాట్లాడుతూ మహేష్ భట్ అన్నారు. పుష్పదీప్ భరద్వాజ్ ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు.