మోడీకి రాహుల్ స‌రైన ప్ర‌త్య‌ర్థి…

Amarinder Singh says Rahul gandhi is strong opponent to Modi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

2019 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ప్ర‌ధాని అభ్య‌ర్థిగా తాను పోటీచేస్తాన‌ని రాహుల్ గాంధీ ప్ర‌క‌టించిన త‌రువాత… ప్ర‌ధాన‌మంత్రి మోడీకి ఆయ‌న దీటైన ప్ర‌త్య‌ర్థి కాద‌నే వాద‌న‌లు బ‌య‌లుదేరాయి. ప్ర‌త్య‌ర్థి పార్టీలే కాకుండా… సొంత పార్టీ కాంగ్రెస్ లోనే రాహుల్ గాంధీ నాయ‌క‌త్వ ప్ర‌తిభ‌పై సందేహాలు ఉన్న‌ట్టు వార్త‌లొచ్చాయి. అయితే ఆ వార్త‌ల‌న్నింటినీ తోసిపుచ్చాడు పంజాబ్ ముఖ్య‌మంత్రి అమ‌రీంద‌ర్ సింగ్. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడికి స‌రైన ప్ర‌త్య‌ర్థి రాహుల్ గాంధీనే అని ఆయ‌న తేల్చిచెప్పారు. ఎవ‌రినైనా స‌వాల్ చేయ‌గ‌ల బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి రాహుల్ అని… స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడల్లా ఆయ‌న రాజ‌కీయ నాయకుడిగా త‌న శ‌క్తిని నిరూపించుకుంటున్నార‌ని అమ‌రీంద‌ర్ వ్యాఖ్యానించారు.

కాలిఫోర్నియా విశ్వ‌విద్యాల‌యంలో ఆయ‌న ప్ర‌ద‌ర్శ‌న అమోఘ‌మ‌ని, తాను ఎంతో కాలంగా చెప్తున్న‌ట్టు ఆయ‌న కాంగ్రెస్ ను న‌డిపే స‌మ‌యం వ‌చ్చింద‌ని, త్వ‌ర‌లోనే ఇది కార్య‌రూపం దాల్చుతుంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీకి కాంగ్రెస్ కు మాత్రమే కాకుండా… 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌తిపక్షాల‌న్నింటికి నాయ‌క‌త్వం వ‌హించ‌గ‌ల స‌త్తా ఉంద‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ గెలుపుకు మంచి అవ‌కాశాలున్నాయ‌ని, ప్ర‌జ‌ల వైఖ‌రి పార్టీకి అనుకూలంగా మారుతోంద‌ని ఆయ‌న విశ్లేషించారు.

ప్ర‌జాస్వామ్యంలో రాజ‌కీయ పార్టీల‌కు ఒడిదొడుకులు స‌హ‌జ‌మ‌ని… కాంగ్రెస్ కూడా ఆ కోవ‌కే చెందుతుంద‌ని అమ‌రీంద‌ర్ వ్యాఖ్యానించారు. జీఎస్ టీ, నోట్ల ర‌ద్దు వంటి కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాల త‌ర్వాత కాంగ్రెస్ బ‌ల‌ప‌డుతున్న‌ట్టు సంకేతాలు అందుతున్నాయ‌ని చెప్పారు. మారుతున్న ప‌రిస్థితుల‌కు రాజ‌స్థాన్, ఢిల్లీ, పంజాబ్ విశ్వవిద్యాల‌య ఎన్నిక‌లే నిద‌ర్శ‌న‌మ‌ని, ప్ర‌తిచోటా కాంగ్రెస్ కు అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని అమ‌రీంద‌ర్ సింగ్ ప్ర‌స్తుత కాంగ్రెస్ స్థితిపై ఆశాభావం వ్య‌క్తంచేశారు.