కోట్ల వైసీపీ కి జై కొడతారా?

kotla surya prakash reddy joins in YSRCP

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కర్నూల్ జిల్లా రాజకీయాల్లో కోట్ల కుటుంబ ప్రాముఖ్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విజయభాస్కర్ రెడ్డి బతికి వున్న రోజుల్లో ఆయనతో కె ఈ కుటుంబం రాజకీయంగా ఢీకొట్టేది. ఇక వై.ఎస్ కాంగ్రెస్ లో నిత్య అసంతృప్త నేతగా విజయభాస్కరరెడ్డి ని ఇబ్బంది పెట్టే వారు. అయితే రాజకీయ దిగ్గజం విజయభాస్కర రెడ్డి ఇటు సొంత పార్టీ, అటు బయట పార్టీలో ప్రత్యర్థుల్ని రాజకీయంగా బాగానే నిలువరించ గలిగారు. కానీ విజయ భాస్కర రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు సూర్య ప్రకాష్ రెడ్డి కర్నూల్ జిల్లా రాజకీయాలకే పరిమితం అయ్యారు. తండ్రికి పంటికింద మెసిలిన వై.ఎస్ ప్రాభవంతో తాను ఎంపీ, భార్య ఎమ్మెల్యే అయినా సొంత ఇమేజ్ పెంచుకోలేకపోయారు. అయినా కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర తండ్రికి వున్న మంచి పేరు అతన్ని నిలబెట్టింది.

ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో ఏపీ లో కాంగ్రెస్ సమాధి అయ్యింది. అప్పటినుంచి కోట్ల కుటుంబాన్ని దగ్గరికి చేర్చుకోడానికి ఇటు టీడీపీ, అటు వైసీపీ ప్రయత్నాలు ప్రారంభించాయి. టీడీపీ లో కె.ఈ కుటుంబం కోట్ల రాకని వ్యతిరేకించింది. అయినా ముందుకు వెళదామని బాబు ఓ దశలో భావించినా రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో ఆపరేషన్ ఆకర్ష్ వల్ల ఏర్పడ్డ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని సైలెంట్ అయ్యారు. ఇక వైసీపీ నుంచి ఎన్ని పిలుపులు వచ్చినా జగన్ ప్రవర్తన మీద వున్న డౌట్ తో సూర్య ప్రకాష్ రెడ్డి మౌనం గా వున్నారు. కానీ పరిస్థితుల్లో ఏ మార్పు లేదు. నంద్యాల ఎన్నికల తర్వాత వైసీపీ కోట్ల కుటుంబం మీద ఒత్తిడి పెంచింది. ఈ దశలో ఏ పార్టీ వెంట నడవాలి అన్న విషయం పై ఓ నిర్ణయం తీసుకోడానికి దేవనకొండలో కోట్ల తన అనుచరులతో ఓ భేటీ నిర్వహిస్తారట. ఈ నెల 5 న జరిగే ఈ భేటీ లో కోట్ల నిర్ణయం బయటికి వచ్చే అవకాశం వుంది. ఇప్పుడు వున్న పరిస్థితుల్లో ఆయన వైసీపీ కి జై కొట్టొచ్చన్న మాట బలంగా వినిపిస్తోంది.