Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రెండు నెలలుగా ఉత్తరకొరియా, అమెరికా మధ్య సాగుతున్న ఉద్రిక్తతలు ఇటీవల కాస్త తగ్గినట్టు కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య రెచ్చగొట్టే ప్రకటనలు, ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాలకు కాస్త బ్రేక్ పడింది. అయితే ఉద్రిక్తతలు పూర్తిగా చల్లారలేదు. రెండు దేశాలు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న అమెరికా రక్షణ శాఖ మంత్రి జిమ్ మాట్టిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరకొరియాతో ఉన్న సమస్యలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించేందుకు తమ దేశం సానుకూలంగా ఉందని, యుద్ధం చేయడం తమ లక్ష్యం కాదని జిమ్ వ్యాఖ్యానించారు. శాంతియుతమైన పరిష్కారం కోసం తాము ప్రయత్నిస్తున్నామని, యుద్ధమే తమకు లక్ష్యం కాదని గతంలో తమ విదేశాంగ మంత్రి టిల్లర్ సన్ చెప్పిన విషయాన్నీ ఆయన గుర్తుచేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నవంబర్ 7,8 తేదీల్లో దక్షిణ కొరియాలో పర్యటించనున్నట్టు జిమ్ చెప్పారు. అయితే ట్రంప్ దక్షిణకొరియాలో పర్యటిస్తే…అమెరికా, ఉత్తరకొరియా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదముందని అంతర్జాతీయ పరిశీలకులు అంటున్నారు.
దక్షిణకొరియాలో ట్రంప్ ఏమాత్రం రెచ్చగొట్టేలా మాట్లాడినా..అమెరికా, ఉత్తరకొరియా మధ్య యుద్ధంతప్పని పరిస్థితులు ఏర్పడతాయని భావిస్తున్నారు. నిజానికి అమెరికా భూభాగమైన గువామ్ పై క్షిపణి దాడిచేస్తామని ఉత్తరకొరియా చేసిన ప్రకటనతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మొదలయినప్పటికీ..తర్వాత ఇరు దేశాలు సంయమనం పాటించాయి. అయితే ఐక్యరాజ్యసమితిలో తొలిసారి అధ్యక్ష హోదాలో ట్రంప్ చేసిన ప్రసంగంపై ఉత్తరకొరియా భగ్గుమంది. తాము తలచుకుంటే..ఉత్తరకొరియాను సర్వనాశనం చేయగలమని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనితర్వాత ఇరుదేశాలు రెచ్చగొట్టే ప్రకటనలు కొనసాగించాయి. అమెరికా ఐక్యరాజ్యసమితిలో పావులుకదిపి ఉత్తరకొరియా పై కఠిన ఆంక్షలు విధించేలా చేయడంతో రెండుదేశాల మధ్య యుద్ధ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ వివాదంలో రెండు దేశాల వైఖరిని ప్రపంచ దేశాలు తప్పుబడుతున్నాయి. సంయమనం పాటించకుండా ఇరుదేశాలు రెచ్చగొట్టే వైఖరితో ముందుకు వెళ్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమయింది.
సద్దాం హుస్సేన్ లా అవుతానన్న భయంతోనే కిమ్ జాంగ్ ఉన్ అణ్వాయుధాలు సమకూర్చుకుంటున్నారని, అమెరికా యుద్ధం ద్వారా ఈ సమస్యను పరిష్కరించలేదని, చర్చల ద్వారానే కిమ్ జాంగ్ ఉన్ ను దారికి తేవచ్చని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభిప్రాయపడ్డారు. అమెరికా ప్రతిపక్షాలు కూడా ఉత్తరకొరియా విషయంలో ట్రంప్ వైఖరిని తప్పుబట్టాయి. డెమోక్రటిక్ నాయకురాలు హిల్లరీ క్లింటన్ ట్రంప్ ను తీవ్రంగా విమర్శించారు. తన విధానాలతో ట్రంప్ మూడో ప్రపంచ యుద్ధం తెచ్చేలా ఉన్నారని, వివాదం మొదలయిన తొలిరోజుల్లోనే చైనా ద్వారా ఉత్తరకొరియాతో చర్చలు జరిపితే బాగుండేదని ఆమె వ్యాఖ్యానించారు. అంతర్జాతీయంగా తలెత్తిన విమర్శల నేపథ్యంలో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారని, అందుకే అమెరికా విదేశంగా మంత్రి… దక్షిణ కొరియా పర్యటనలో ఉత్తరకొరియాతో చర్చల గురించి ప్రస్తావించారని… రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కారణం ఏదైనాకానీ…అమెరికా, ఉత్తరకొరియా యుద్ధానికి దిగకుండా ఉంటే..ఆ రెండు దేశాలతో పాటు మిగిలిన ప్రపంచం కూడా ప్రశాంతంగా ఉంటుంది.