Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దేశంలో ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీది గెలిచి తీరాల్సిన స్థితి. దేశమంతా అనేక కారణాలతో మోడీపై వ్యతిరేక గాలివీస్తున్న ప్రస్తుత తరుణంలో కర్నాటకంలో ఓడిపోతే… బీజేపీని మరిన్ని కష్టాలు వెంటాడుతాయి. ఏకమవుతున్న ప్రత్యర్థుల్లో చీలిక తేవడానికి, చుట్టుముట్టుతున్న విమర్శలను తిప్పికొట్టడానికి, నిస్తేజం అలుముకున్న పార్టీని తిరిగి గాడిలో పెట్టడానికి… కర్నాటకలో గెలుపు ఒక్కటే ఆధారం. అందుకే భవిష్యత్ రాజకీయ లెక్కలన్నీ ఆధారపడి ఉన్న కర్నాటకాన్ని గట్టెక్కేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. కర్నాటక నలుమూలలా విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే గెలిచితీరాలన్న ఒత్తిడో, మరే కారణమో కానీ ఇతర రాష్ట్రాల్లోలా అమిత్ షా కర్నాటకలో అంత సౌకర్యవంతంగా లేరు. కాంగ్రెస్ పై పదునైన విమర్శలతో దాడిచేస్తూ… ఆ పార్టీ నేతలను గుక్కతిప్పుకోనీకుండా చేసే అమిత్ షా కర్నాటక లో మాత్రం తడబాటుకు గురవుతున్నారు.
సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని విమర్శించబోయి… యడ్యూరప్ప ప్రభుత్వం అవినీతిమయం అయిందనడం, కర్నాటక సిల్క్ ఉత్పత్తిలో దేశంలో మొదటి స్థానంలో ఉందని పొగడడం ఇవన్నీ ఆ తడబాటులో భాగమే. ఎన్నికల ప్రసంగాల తప్పులే కాదు… ఇప్పుడు మరో అపశృతీ ఆయనకు ఎదురై… పార్టీ గెలుపుపై అనేక ఊహాగానాలకు తావిచ్చింది. కర్నాటక ఎన్నికల్లో లింగాయత్ ఓట్లు కీలకం. వారి ఆరాధ్యుడైన బసవన్న జయంతిని అన్ని పార్టీలు ఘనంగా నిర్వహించాయి. బీజేపీ కూడా బసవన్నకు ఘనంగా నివాళుర్పించింది. ఇదే క్రమంలో బెంగళూరులోని చాళుక్క సర్కిల్ లో ఉన్న బసవన్న భారీ విగ్రహానికి నివాళి అర్పించేందుకు అమిత్ షా, యడ్యూరప్పలు అక్కడికి చేరుకున్నారు. 12 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహానికి పూలమాల వేసేందుకు వారిద్దరూ క్రేన్ పైకి ఎక్కారు. క్రేన్ పైకి ఎక్కినప్పటికీ… అమిత్ షా కన్నా విగ్రహం ఎత్తుగానే ఉండడంతో… పూలమాల వేయడానికి ఆయన ఇబ్బందిపడ్డారు. అమిత్ షా విసిరిన దండ గురితప్పి, కిందకు జారి పడిపోయింది. అదే సయయంలో యడ్యూరప్ప మాత్రం బసవన్న మెడలో పడేటట్టుగా దండవేశారు.
అయితే అమిత్ షా దండ పడిపోవడంపై ఆ పార్టీ వ్యతిరేకులు కొత్త ప్రచారం మొదలుపెట్టారు. బీజేపీకి ఇది దుశ్శకునమని, ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోతుందనడానికి ఇది ముందస్తు సంకేతమని, బసవన్న ఆశీర్వచనం ఆ పార్టీకి లేదని ప్రచారం చేస్తున్నారు. బీజేపీ మద్దతుదారులు మాత్రం ఈ వాదనను తోసిపుచ్చుతున్నారు. అమిత్ షా వేసిన దండ కిందపడిపోయినప్పటికీ… పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప వేసిన దండ గురితప్పలేదని, సరిగ్గా బసవన్న మెడలోనే పడిందని… కాబట్టి… ఇది దుశ్శకునం కాదని ఎదురుదాడిచేస్తున్నారు. మొత్తానికి ప్రతిష్టాత్మకంగా మారిన ఎన్నికల్లో… ప్రసంగాలనుంచి, దండల దాకా ఏ అంశాన్నీ పార్టీలు వదిలిపెట్టడం లేదు.