Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయాల్లో అమిత్ షా తిమ్మినిబమ్మిని చేస్తాడని ప్రధాని మోడీ, ఆయన వీర శిష్య పరమాణువులు బలంగా నమ్ముతారు. అందుకే మొన్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తుంటే తొలి ట్రెండ్స్ చూసి రెచ్చిపోయిన ఆ బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన రామ్ మాధవ్ ఏదైనా ఇబ్బంది ఎదురైతే మా పక్క అమిత్ షా వున్నాడని ఎంతో గర్వంగా చెప్పుకున్నారు. అయితే ఆ పై ఆ గర్వాన్ని దెబ్బ తీసిన కన్నడ రాజకీయం అమిత్ షా చాణుక్యం దక్షిణాదిన పని చేయదని నిరూపించారు. అయితే ఉత్తరాదిలో పని చేస్తుంది అనుకుంటున్నారా ? అక్కడ కూడా సీన్ రివర్స్ అయిన విషయం నిన్నటితో తేలిపోయింది.
శివసేన ఛీచా అంటూ నిప్పులు చెరుగుతున్నప్పటికీ రాజకీయ అవసరార్ధం ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే ఇంటికి వెళ్లారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. ఉద్ధవ్ దెబ్బకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిని సమావేశ మందిరంలోకి రానీయకపోయినా అమిత్ షా రెండు గంటల పాటు ఉద్ధవ్ తో nda లో శివసేన కొనసాగాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. అటు ఉద్ధవ్ కూడా ఇన్నేళ్లు మేము ఎందుకు గుర్తుకు రాలేందంటూ అడగాల్సిన నాలుగు కడిగిపారేసిన రీతిలో అడిగారు. అయినా నాలుగు గోడల మధ్య జరిగింది బయటకు ఎవరు చెబుతారులే అనుకుంటూ చర్చలు సానుకూలంగా జరిగాయని అమిత్ షా గారు ఘనంగా చెప్పుకున్నారు. అక్కడే ఆయన శివసేనని తక్కువ అంచనా వేశారు.
ఇంకాసేపట్లో రాబోయే అతిధి ని ఏకిపారేసిన శివసేన, ఆ అతిధి వెళ్ళిపోయాక మాత్రం చూస్తూ ఊరుకుంటుందా ? కడిగి పారేసింది. అమిత్ షా మా దగ్గరకు ఎందుకు వచ్చాడో తెలుసనీ, అయితే ఆయన ఆలోచనలకు భిన్నంగా వచ్చే ఎన్నికల్లో శివసేన ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ కుండ బద్దలు కొట్టారు. అదండీ మహారాష్ట్రలో అమిత్ షా మంత్రాంగం ఇచ్చిన ఫలితం. అయినా అధికారం మత్తులో కన్నుమిన్ను కనపడకుండా వ్యవహరిస్తే అది దూరం అయ్యే పరిస్థితుల్లో ఇలాంటి ఛీత్కారాలు, పరాభవాలే ఎదురు అవుతాయి.