మగబిడ్డకి జన్మనిచ్చిన అమృత !

Amrutha Gives Birth Baby Boy

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నాలుగు నెలల కిందట జరిగిన ప్రణయ్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తన కూతురు తక్కువ కులానికి చెందిన యువకుణ్ని ప్రేమించి పెళ్లి చేసుకొని తన పరువు తీసిందనే కోపంతో మారుతీరావు అనే వ్యాపారి హంతకులతో ప్రణయ్‌ను దారుణంగా హత్య చేయించాడు. గర్భిణి అయిన అమృతను చెకప్ కోసం మిర్యాలగూడలోని ఆస్పత్రికి తీసుకెళ్లి తిరిగొస్తుండగా ఆస్పత్రి బయట మాటువేసిన హంతకుడు కత్తితో ప్రణయ్ మెడపై దారుణంగా నరికి హత్య చేశాడు. అప్పటికి ఆయన కూతురు అమృత కడుపుతో ఉన్నది. ఆమె ఈరోజు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అమృత మగబిడ్డకు జన్మనిచ్చినట్టు ఆమె అత్తా మామలు ప్రకటించారు. తల్లీబిడ్డలిద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రణయ్‌ హత్య జరిగిన సమయంలో గర్భిణిగా ఉన్న అమృత మీడియాతో మాట్లాడుతూ తన కడుపులో ప్రణయ్ ప్రతిరూపం పెరుగుతోందని, ఆ బిడ్డకు జన్మనిచ్చి ప్రణయ్‌ని చూసుకుంటానని చెప్పిన విషయం తెలిసిందే. ఆ రోజు చెప్పినట్టే అమృత పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉన్నారు. మరోపక్క తనకి పుట్టిన కొడుకుని చూసుకోలేక పోయాడని వారు ఆవేదన చెందుతున్నారు.