11 ఏళ్ల బాలిక నెలకు రూ.6 లక్షలు సంపాదిస్తుంది. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్‌కు 60 కిలో మీటర్ల దూరంలో నిగోస్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి చెందిన పాల వ్యాపారి సత్యధావన్. ఇతను పెద్దగా చదువుకోలేదు. తనకు కార్తీక్ అనే కుమారుడు, శ్రద్ధాధావన్ అనే కుమార్తె ఉంది. ధావన్ బాగా చదువుకోలేదు కనుక తన పిల్లల్ని బాగా చదివించుకోవాలని అనుకున్నాడు.
ఆయనకు అనుకోకుండా వచ్చిన అనారోగ్యంతో తన పాల వ్యాపారం కాస్త కుంటుపడింది. చూసే వాళ్లు ఎవరూ లేకపోవడంతో ఒక్క పశువును ఉంచుకుని మిగతా వాటిని అమ్మేశారు. చూస్తూ చేస్తూ ఉండగానే కుటుంబ పోషణతో పాటు పిల్లల చదువులు అతనికి భారంగా మారాయి. తర్వాత తన కుటుంబాన్ని, పాల వ్యాపారాన్ని ఎవరికి అప్పగించాలో అర్థంకాలేదు. ఆ సమయంలో పదకొండేళ్ల వయసులో ఉన్న శ్రద్ధ ఆశాదీపంలా కనిపించింది. మన పాల వ్యాపారం చూసుకోగలవా అని తండ్రి ధావన్ కుమర్తె శ్రద్ధను అడిగారు. తండ్రి అడగ్గానే ఉత్సాహంగా ఊ కొట్టింది శ్రద్ధ. తన ఇంటి పరిస్థితులను అర్ధం చేసుకుని పశువుల పాకలోకి శ్రద్ధ అడుగుపెట్టింది. వ్యాపారం అనే పదానికి అర్థం కూడా తెలియని ఆ పసిప్రాయంలో తండ్రిని అడిగి ఎన్నో విషయాలను శ్రద్ధగా తెలుసుకునేది శ్రద్ధ.
పశువుల పాక శుభ్రం చేయడం, పాలు తీయడం వంటి పనులను శ్రద్ధగా చేసేది. సైకిల్‌పై పాల కేంద్రానికి పాలను సరఫరా చేసేది. పశువులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే పశు వైద్యులను సంప్రదించేది. అన్నింటికంటే ముఖ్యంగా సేంద్రియ పద్ధతిలో పెంచిన గ్రాసాన్ని మాత్రమే పశువులకు ఆహారంగా వేసేది. దాంతో పశువులు ఆరోగ్యంగా ఉండి పాలు పుష్కలంగా ఇచ్చేవి. దాంతో మిగిలిన పాలను గ్రామంలో అవసరమైన వారికి అమ్మేది. బాధ్యతలు పెరిగే సరికి సైకిల్ వదిలి బైక్ నడపటం నేర్చుకుంది. గ్రామంలో బైక్‌పై తిరుగుతూ పాలను విక్రయించే మొట్టమొదటి ఆడపిల్ల అయింది శ్రద్ధా ధావన్.