Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్ని వెబ్ సైట్లు ఉన్నప్పటికీ సోషల్ మీడియా అనగానే మొదటగా గుర్తొచ్చేది ఫేస్ బుక్. సామాజిక అనుసంధానం మొదలయింది ఫేస్ బుక్ తోనే. కంప్యూటర్ విప్లవంలో ఫేస్ బుక్ ఓ ప్రభంజనం. పాత వారిని కలిపింది. కొత్త వ్యక్తులను పరిచయం చేసింది. అభిప్రాయాల వ్యక్తీకరణకు ఓ వేదికగా మారింది. వ్యవస్థలకు కొత్తరూపు ఇచ్చింది. ప్రభుత్వాలను ప్రజలకు అనుసంధానం చేసింది. స్థూలంగా చెప్పాలంటే సాధారణ వ్యక్తుల నుంచి వ్యవస్థలదాకా అన్నింటిమీదా ప్రభావం చూపింది. ఫేస్ బుక్ విప్లవం ఏ ఒక్క దేశానికో పరిమితం కాదు… అన్ని దేశాల్లోనూ తనముద్ర వేసింది. అందుకే ఫేస్ బుక్ లోని కోట్లాదిమంది ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయిందన్న వార్త విని అన్నిదేశాలూ ఉలిక్కిపడ్డాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కోసం పనిచేసిన కేంబ్రిడ్జి అనలిటికా అనే సంస్థ దగ్గర దాదాపు 5 కోట్లమంది ఫేస్ బుక్ ఖాతాల సమాచారం చిక్కిందన్న ఆరోపణలు, ఈ సమాచారంతో ఎన్నికలను ప్రభావితం చేయగలరన్న విశ్లేషణలపై భారత్ కూడా తీవ్రంగా స్పందించింది.
డేటా చోరీకి సంబంధించి ఏవైనా ఉల్లంఘనలు జరిగినట్టు తమ దృష్టికి వస్తే ఐటీ చట్టం కింద తీవ్ర పరిణామాలు ఎదుక్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అదే సమయంలో ఫేస్ బుక్ ప్రత్యామ్నాయంపై దేశంలో చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త, మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర స్పందించారు. ఫేస్ బుక్ లాంటి దిగ్గజ సోషల్ మీడియాకు ప్రత్యామ్నాయం రావాల్సిన సమయం వచ్చిందేమో అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. వృత్తిపరంగా మనకంటూ సొంత సోషల్ నెట్ వర్కింగ్ కంపెనీ ఉండాలని ఆలోచించాల్సిన సమయం వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. అలా ఏదైనా భారత్ స్టార్టప్ వచ్చే అవకాశముందా… ఒకవేళ యువత అలాంటి ప్రణాళికల్లో ఉంటే వారికి పెట్టుబడి పరంగా సాయం చేయాలని భావిస్తున్నాను అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. నిజానికి యువతకు ఇది అద్భుత అవకాశం. పెట్టుబడి సాయం, ఫేస్ బుక్ కు ప్రత్యామ్నాయ అవసరం ఉన్న ఈ సందర్భంలో ఓ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఏర్పాటు చేస్తే… అది నెటిజన్ల విశేషాదారణ పొందుతుంది. ఈ అవకాశాన్ని యువత వినియోగించుకోవాలని పలువురు సూచిస్తున్నారు.