మేడం రోజూ స్కూల్కెళ్లి పాఠాలు చెప్పడం ఇబ్బందనుకున్నారో లేక మరేదైనా కారణమో తెలీదు కాని ఆమె స్థానంలో భర్త హాజరయ్యారు. తనూ ఓ పాఠశాలలో టీచర్ అయినప్పటికీ అక్కడ విధులకు డుమ్మా కొట్టి..భార్య ‘విధుల’ను నిర్వర్తించారు. ఈ విషయం ఎంఈఓ తనిఖీలో బయటపడడంతో ఆమెను సస్పెండ్ చేయడంతో పాటు అయ్యవారిపైనా చర్యలకు సిఫారసు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
రమేష్ కదిరి పట్టణంలోని రాణీనగర్ మునిసిపల్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన భార్య ఆర్.అరుణాదేవి ఓడీచెరువు మండలం టి.కుంట్లపల్లి హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్ . అరుణాదేవి ఈ నెల 7 నుంచి 9 వరకు సెలవుపై వెళ్లారు. పదో తేదీ విధులకు హాజరుకావాల్సి ఉండేది.
ఆమె వస్తారనే ఉద్దేశంతో ఆరోజు హెచ్ఎం సునీత సెలవు పెట్టారు. కానీ అరుణాదేవి స్థానంలో భర్త రమేష్ విధులకు హాజరయ్యారు. ఈ విషయం ఎంఈఓ చెన్నక్రిష్ణ ఆకస్మిక తనిఖీలో బయటపడింది. ఆయన డీఈఓకు నివేదిక పంపడంతో అరుణాదేవిని సస్పెండ్ చేస్తూ ఆదివారం ఉత్తర్వులిచ్చారు. ఆమె భర్తపైనా చర్యలు తీసుకోవాలని కదిరి మునిసిపల్ కార్యాలయానికి సిఫారసు చేశారు.