Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తప్పులను అంగీకరించే వాళ్లు చాలా తక్కువ. నెపాన్ని మరొకరికి పైకి నెట్టడమో, లేదంటే అసలు తమది తప్పేకాదని సమర్థించుకోవడమో చేస్తుంటారు. జబర్దస్ షో విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఈ కామెడీ స్కిట్ ఎన్నోసార్లు శృతితప్పింది. అనవసర వివాదాలకూ కేంద్రబిందువయింది. కానీ అందరూ చాలా సార్లు ఆ షోను. నిర్వాహకులను, పార్టిసిపెంట్స్ ను, జడ్జిలను, యాంకర్లను చూసీ చూడనట్టే వదిలేశారు. కానీ ఇటీవల ప్రసారమైన అనాథశ్రమ స్కిట్ ను మాత్రం ఎవ్వరూ క్షమించడం లేదు. అసభ్యం, అశ్లీలత వంటి అభిప్రాయాలను పట్టించుకోకుండా…జబర్దస్త్ ను కామెడీ కోసం విపరీతంగా ఇష్టపడే ఓ వర్గం యువత కూడా అనాథాశ్రమం స్కిట్ పై సోషల్ మీడియాలో నిప్పులు చెరుగుతోంది.
అయితే దీనిపై బాధ్యతగా స్పందించాల్సిన షో జడ్జిలు, యాంకర్లు మాత్రం తమ తప్పును కప్పిపుచ్చుకోడానికి కొత్త కొత్త వాదనలు తెరపైకి తెస్తున్నారు. జడ్జిల్లో ఒకరైన నాగబాబు…జబర్దస్త్ గురించి మాట్లాడడానికి మీడియా ఎవరని ప్రశ్నించినట్టు, వివాదంపై స్పందించాల్సిన అవసరమే తనకు లేదని వ్యాఖ్యానించినట్టు వార్తలొచ్చాయి. తాజాగా కార్యక్రమానికి యాంకర్ గా ఉన్న అనసూయ కూడా స్కిట్ ను సమర్థిస్తూ మాట్లాడింది. అనాథపిల్లలపై వ్యాఖ్యలు రాగానే నాగబాబు, రోజాలతో పాటు పగలబడి నవ్విన అనసూయ…అందులో తప్పేమీలేదని వ్యాఖ్యానించింది.
ఫేస్ బుక్ లైవ్ చాట్ లో దీనిపై మాట్లాడిన అనసూయ సమస్యను గురించి ఆలోచిస్తే క్రియేటివిటీ పోతుందని, లాజిక్స్ కోసం చూడకుండా నవ్వుకోవాలని అర్ధరహిత వ్యాఖ్యలు చేసింది. జీవితంలో వచ్చే అన్ని అంశాలను తాము చూపిస్తున్నామని, లీడ్ కోసమే అనాథాశ్రమం స్కిట్ లో అలాంటి డైలాగ్ వాడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఎవరినీ కించపరిచే ఉద్దేశం జబర్దస్త్ కు లేదని, అందరినీ నవ్వించాలన్నదే తమ ఉద్దేశం అని, నవ్వించేవాళ్లను ఏడిపించడం ఏమన్నా బాగుందా అని ప్రశ్నించింది.
అత్యాచారాలు, విద్య, రహదారులు, కరెంట్ వంటి ఎన్నో సమస్యలు ఉండగా…వినోదాన్ని అందించే జబర్దస్త్ ను హైలెట్ చేయడం ఎందుకుని ప్రశ్నించింది. అంతేకాదు..తెలుగు సినీ పరిశ్రమకు బాహుబలి ఎలాంటిదో టీవీ ఇండస్ట్రీకి జబర్దస్త్ అలాంటిదని, షో కోసం నాగబాబు, రోజా ఎంతో శ్రమిస్తున్నారని అనసూయ అందరినీ వెనకేసుకొచ్చింది.