Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మీడియా ముందు రెచ్చిపోవద్దని బీజేపీ అధిష్టానం ఎన్నోసార్లు మొట్టికాయలు వేసినా ఆ పార్టీ నేత సోము వీర్రాజు మళ్ళీ మళ్ళీ మొదటికే వస్తుంటారు. ఎప్పుడెప్పుడు బీజేపీ , టీడీపీ మధ్య బంధం తెగిపోతుందా అని ఆశగా ఎదురు చూడడమే కాదు అందుకోసం తన వంతుగా ఏమి చేయాలో కూడా చేస్తుంటారు. గుజరాత్ ఎన్నికల ఫలితాలు తర్వాత టీడీపీ కి సవాళ్లు విసరడం కూడా అందులో భాగమే. అయితే హైకమాండ్ ఈసారి గట్టిగా వార్నింగ్ ఇచ్చిందేమో టీడీపీ మా మిత్రపక్షం అంటూ కొత్త పల్లవి అందుకున్నారు సోము. వీర్రాజు అప్పుడు ఎలా మాట్లాడారు, ఇప్పుడెలా మాట్లాడుతున్నారు అనేదానిపై ఆంధ్రజ్యోతి ఓ రేంజ్ లో ప్రచారం చేస్తోంది. ఇదంతా చూసినవాళ్లకు సోము ని ఆంధ్రజ్యోతి చీల్చి చెండాడాడుతోంది అనుకుంటాం. అదే ఆంధ్రజ్యోతి సోము మనసులో ఏముందో తెలుసుకుని ఆ కోరిక తీర్చే ప్రయత్నం చేస్తున్నట్లుంది.
కొన్నాళ్లుగా బీజేపీ,టీడీపీ మధ్య పొత్తు నామ మాత్రమే అనిపిస్తోంది. బీజేపీ ఎప్పుడైతే వైసీపీ అధినేత జగన్ ని దువ్వడం మొదలు పెట్టిందో అప్పటి నుంచి సమస్య తీవ్ర రూపం దాల్చింది. విభజన హామీలను మోడీ సర్కార్ తుంగలో తొక్కడంతో రగిలిపోతున్న చంద్రబాబు సహనంతో వుంటూ ఏదో రకంగా కేంద్రం నుంచి సాయం పొందే ప్రయత్నం చేశారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో పాటు రాజకీయంగా కూడా దెబ్బ తీయడానికి బీజేపీ ట్రై చేయడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. అందుకే అతను కోసం ఎదురు చూస్తున్నారు. గుజరాత్ ఫలితాలతో ఢిఫెన్స్ లో పడ్డ బీజేపీ ని పోలవరం వ్యవహారంలో కార్నర్ చేశారు.
పోలవరం కి అడ్డం పడితే ఆంధ్రాలో ఒక్క ఓటు కూడా రాదన్న విషయం అర్ధం చేసుకున్న బీజేపీ ఆ విషయంలో ఓ మెట్టు దిగినా మిగిలిన విభజన హామీల్లో ఏ ఒక్కదాన్ని నెరవేర్చేందుకు సిద్ధంగా లేదు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఓ సిరీస్ గా కేంద్రం ఏ విధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్న కోణంలో వరుస కధనాలు అందిస్తోంది. నిజానికి ఇలాంటి సందర్భాల్లో బాబు మనసులో ఏముందో ఆంధ్రజ్యోతి అదే రాస్తుంది అన్న ప్రచారం వుంది. అంటే త్వరలో బీజేపీ కి బాబు గుడ్ బై కొట్టే ఆలోచనలో వున్నారన్నమాట. అయితే ఆంధ్రజ్యోతి ఏకిపారేస్తున్న సోము వీర్రాజు మనసులో వుంది కూడా ఇదే కోరిక కదా. సోము కోరిక తీరుస్తూనే ఆంధ్రజ్యోతి ఆయన్ని చీల్చి చెండాడడం చూస్తుంటే ఆశ్చర్యం అనిపించడం లేదూ!