సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రియా చక్రవర్తిపై సుశాంత్ తండ్రి బిహార్‌లో కేసు నమోదు చేశాడు. ఆమె వచ్చాకే సుశాంత్ తమకు దూరమయ్యాడని.. డబ్బుల కోసం ఆమె సుశాంత్‌ని వేధించిందని తెలిపాడు. తాజాగా సుశాంత్ మాజీ ప్రియురాలు అంకత లోఖండే కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో అంకిత తాను సుశాంత్ కుటుంబం తరఫున మాట్లాడతానని తెలిపారు.
ఈ సందర్భంగా అంకిత మాట్లాడుతూ.. ‘నేను సుశాంత్, రియాల బంధం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయను. సుశాంత్ కుటుంబం తరఫున నేను మాట్లాడతాను. వారికి మద్దతుగా నిలబడతాను. ఇక్కడ నిరూపించాల్సింది.. ప్రజలకు చూపించాల్సిన వాస్తవాలు ఉన్నాయి. సుశాంత్ కుటుంబంతో నాకు ఏళ్ల పరిచయం. నేను వారితో ఎంతో సమయం గడిపాను. అందుకే వారి తరఫున మాట్లాడతాను. నాకు నిజం తెలియాలి’ అన్నారు.
అంతేకాక ‘సుశాంత్ డిప్రెషన్‌తో బాధపడుతున్నాడంటే నేను నమ్మను. ఒవవేళ తనది ఆత్మహత్య అని ఎవరైనా అంటే.. ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒక వేళ ఇది హత్య అయితే.. ఎవరు చేశారో తెలుసుకోవాలనుకుంటున్నాను. నా జీవితంలో ఏడు సంవత్సరాలు సుశాంత్ కోసం, అతడి కుటుంబం కోసం కేటాయించాను. నాకు నిజం కావాలి. అసలు వాస్తవంగా ఏం జరిగిందనేది నాకు తెలియాలి’ అన్నారు అంకిత.
అంతేకాక ‘నేను చూసినంత వరకు సుశాంత్ డిప్రెషన్‌కు గురయ్యే వ్యక్తి కాదు. తనలాంటి వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు. చిన్న చిన్న విషయాల్లో సంతోషాన్ని వెతుక్కునే వాడు. వ్యవసాయం అంటే అతడికి ఇష్టం. రాబోయే ఐదేళ్ల గురించి తన ప్రణాళికలు సిద్ధం చేసుకునేవాడు. ఖచ్చితంగా ఐదేళ్లలోపు వాటిని పూర్తి చేసేవాడు. తన కలల గురించి డైరీలో రాసుకునేవాడు.
అతడి మరణం తర్వాత డిప్రెషన్‌తోనే ఆత్మహత్య చేసుకున్నాడనే వార్తలు వింటే నా గుండె బద్దలవుతోంది. తనను కుంగుబాటుకు గురయిన వ్యక్తిగా లోకం గుర్తించడం నాకు ఇష్టం లేదు. తను హీరో.. ఎందరికో స్ఫూర్తి’ అన్నారు అంకిత. సుశాంత్, అంకిత పవిత్ర రిష్తా సీరియల్లో కలిసి నటించారు. దాదాపు ఆరేళ్ల పాటు ప్రేమించుకున్నారు. 2016లో విడిపోయారు. కానీ మంచి స్నేహితులుగా ఉన్నారు.